Pawan Kalyan : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
బాక్సుల విధానంలో రోప్‌ల సాయంతో యాభై మంది చొప్పున భక్తులను క్యూలైన్‌లోకి పోలీసులు పంపుతున్నారు...
Pawan Kalyan : ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటేత్తారు. దీంలో అధికారులు అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన పవన్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కూతురు ఆధ్య తో ఆయన దర్శనానికి వచ్చారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత వచ్చారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను చూడగానే భక్తులలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి భక్తులు బారులు తీరారు.
Pawan Kalyan Visit..
బాక్సుల విధానంలో రోప్‌ల సాయంతో యాభై మంది చొప్పున భక్తులను క్యూలైన్‌లోకి పోలీసులు పంపుతున్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టి లో ఉంచుకుని సీపీ రాజశేఖర్ బాబు ముందస్తుగా అవసరమైన అన్నీ చర్యలు చేపట్టారు. కొండపైకి ఈరోజు ఎటువంటి వాహనాలను అనుమతించమని పోలీసులు వెల్లడించారు. కాగా బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి మూడు గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) రాక సందర్భంగా నగరంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ తెలిపారు. డైనమిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉందన్నారు. కనకదుర్గా ఫ్లైఓవర్ మీద ఎటువంటి ఆంక్షలు లేవని, కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఫ్లై ఓవర్‌పై రాకపోకలు పూర్తిగా నిషేధించామన్నారు. ఇప్పటికే విధులలో 4,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా, అదనంగా మరో 1100 మంది పోలీసులను 110 బృందాలుగా ఏర్పాటు చేసి హోల్డింగ్ టీమ్‌లుగా విధులు కేటాయించినట్టు తెలిపారు.
కాగా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజు మంగళవారం కనకదుర్గమ్మ అదృష్టం, విలాసం, ఐశ్వర్యం, సంపద, శ్రేయస్సులకు ప్రదాత అయిన లక్ష్మీదేవిగా దర్శనమివ్వగా అమ్మ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ క్యూలైన్లలో రద్దీ కొనసాగింది. ఒంటినిండా బంగారం, పుష్పాలంకరణలో ఐశ్వర్య ప్రదాయిని రూపాన్ని తిలకించి తరించారు. సాయంత్రం అమ్మవారి నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో తెల్లవారుజాము నుంచి అన్ని క్యూలు నిండిపోయాయి. కనకదుర్గమ్మ మంగళవారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, శివస్వామి దర్శించుకున్నారు. అన్నవరం దేవస్థానం అధికారులు, అర్చకులు అమ్మవారికి పట్టువస్త్రాలను, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల నుంచి పట్టుచీర సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై మంగళవారం సాధారణంగానే కనిపించింది. మామూలు రోజుల్లో ఆదివారం, మంగళవారం, శుక్రవారం భక్తులు అధికంగా వస్తుంటారు. ఈ రోజుల్లో 50 వేల నుంచి 60 వేల వరకు భక్తుల సంఖ్య ఉంటుంది. ఆ స్థాయిలోనే భక్తులు వచ్చారని ఆలయ అధికారులు అంచనా వేశారు.
విజయవాడకు చెందిన ఓ మహిళ రూ.500 క్యూలో వచ్చి రాజగోపురం వద్ద సొమ్ముసిల్లి పడిపోయింది. ప్రొటోకాల్ జాబితాలో ఉన్న వారి సందడి ఎక్కువగా కనిపించింది. మధ్యాహ్నం నుంచి కాణిపాకం దేవస్థానం అధికారులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనధికార దర్శనాలు పెరిగిపోవడంతో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. వీఐపీలకు కేటాయించిన 9-11, 2-4 స్లాట్‌ల్లో కాకుండా ఇతర సమయాల్లో వస్తే వారిని వీఐపీ మార్గంలో దర్శనాలకు అనుమతించడంలేదు. వారిని రూ.500 క్యూలో పంపుతున్నారు. అమ్మవారు బుధవారం మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : CM Chandrababu Meet : ప్రధాని మోదీతో సహా ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సీఎం