AP Elections 2024: ఏపీలో మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ !

ఏపీలో మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ !

AP Elections 2024 :ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. బ్యాలెట్ల ముద్రణ బుధవారం సాయంత్రమే మొదలైందని… ఇప్పటికే భద్రతా దళాలకు ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్లు పంపామని హైకోర్టుకు నివేదించింది. ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఆప్షన్ ఇచ్చిన 85 ఏళ్లు దాటిన వయోవృద్ధుల నుంచి పోస్టల్‌ బ్యాలెట్లు సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని.. రాజ్యాంగంలోని 329(బీ) అధికరణ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పేర్కొంది.

AP Elections 2024 :

టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున, గాజుగ్లాసు గుర్తును ఇతర స్వతంత్ర అభ్యర్థులెవరికీ కేటాయించకుండా జనసేనకు మాత్రమే రిజర్వ్‌ చేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులు మాత్రమే ఉంటాయి. చదవలేని నిరక్షరాస్యులైన ఓటర్లు గుర్తు ఆధారంగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు. గాజుగ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో ఈసీ ఉత్తర్వులు పరిమిత నియోజకవర్గాలపై మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను నిలువరించాలని మేం కోరడం లేదు. మా వినతిని పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలిచ్చేలా ఈసీని ఆదేశించండి’ అని కోరారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ స్పందిస్తూ.. టీడీపీ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు.

ఎన్నికల ముందు పొత్తును చట్టంలో ఎక్కడా గుర్తించలేదని తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ జోక్యం చేసుకుని.. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో వివరాలు తెలుసుకుని కోర్టు ముందుంచాలని దేశాయ్‌ ను ఆదేశించారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు విచారణ జరిపారు. గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ల ముద్రణ, పోస్టల్‌ బ్యాలెట్ల సేకరణకు సంబంధించిన పై తాజా వివరాలను ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది కోర్టు ముందుంచారు. దమ్మాలపాటి స్పందిస్తూ.. పిటిషనర్‌ నుంచి వివరాలు తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు సమయమివ్వాలని అభ్యర్థించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు.

Also Read :-AP Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పై వెనక్కి తగ్గేది లేదు – మంత్రి పెద్దిరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!