AP Govt : ఏపీలో ఇసుక దోపిడీపై 329 పేజీల సాక్షాలను సుప్రీంకోర్టు కి అందజేసిన సర్కార్

ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జేపీ వెంచర్స్‌కు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే...

AP Govt : ఏపీలో గత నాలుగేళ్లలో 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీకి గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా ఇసుక దోపిడీని ప్రభుత్వం అంచనా వేసింది. 13 ఎఫ్‌ఐఆర్‌లను ఏపీ(AP) ప్రభుత్వం నమోదు చేసింది. గత నాలుగేళ్లలో 465.36 హెక్టార్లలో 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని… దాదాపు 63 కేసుల్లో వివిధ సంస్థలకు ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

AP Govt….

ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జేపీ వెంచర్స్‌కు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. జేపీ వెంచర్స్‌కు దాదాపు రూ. 18 కోట్ల జరిమానాను గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంను జేపీ వెంచర్స్ ఆశ్రయించింది. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జీడీ స్టీరియో డేటా, 2డీ గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్‌‌ను ఉపయోగించి ఇసుక అక్రమాలను ఏపీ(AP) ప్రభుత్వం వెలుగులోకి తీసుకువచ్చింది. గత నాలుగేళ్లలో జరిగిన ఇసుక అక్రమాలన్నింటినీ 329 పేజీలలో సాక్ష్యాలతో సహా సుప్రీం కోర్టుకు ఏపీ(AP) ప్రభుత్వం వివరించింది.

‘‘రాష్ట్రవ్యాప్తంగా ఇసుక వనరులున్న ప్రాంతాల్లో జరిగిన అక్రమ తవ్వకాలను గుర్తించడానికి ఏపీ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఏపీఎస్‌ఏసీ) ద్వారా శాటిలైట్‌ ఇమేజ్‌లను ఉపయోగించి అధ్యయనం చేస్తున్నాం. అత్యాధునిక జియోస్పేషియల్‌ టెక్నాలజీస్‌ ఆధారంగా ఈ సంస్థ శాస్త్రీయమైన సాంకేతిక మద్దతు అందిస్తోంది. జీడీ స్టీరియో డేటా, 2డీ గూగుల్‌ ఎర్త్‌ప్రో ఇమేజెస్‌ను ఉపయోగించి అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాం. లోతైన అధ్యయనం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 478 ఇసుక రీచ్‌ల జియో కోఆర్డినేట్స్‌ను ఏపీఎస్‌ఏసీకి అందించాం. ఇప్పటి వరకు అక్రమంగా ఇసుక తవ్విన 135 ప్రాంతాలను గుర్తించారు. దీనిపై తదుపరి విశ్లేషణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏపీఎస్‌ఏసీ అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం 2021-24 మధ్యకాలంలో 465.26 హెక్టార్లలో 46,52,600 ఘనపు మీటర్ల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు తేలింది. ఆగస్టు 23న సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం జేపీవీఎల్‌ సంస్థకు 9 కేసుల్లో షోకాజ్‌ నోటీసులు, రూ.916.19 కోట్లకు డిమాండ్‌ నోటీసులు జారీ చేశాం.

దీనికి అదనంగా జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా సంస్థలకు 27 కేసుల్లో షోకాజ్‌ నోటీసులిచ్చాం. ఆగస్టులో అఫిడవిట్‌ దాఖలు చేసే సమయానికి చర్యలు తీసుకోని సంస్థలపై ఇప్పుడు కొత్తగా 25 కేసుల్లో చర్యలకు ఉపక్రమించాం. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమాలతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన ఇతర సంస్థలపై మొత్తం 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఈ సంస్థలు చేసిన నేరాల తీవ్రత, దానివల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వేగంగా దర్యాప్తు జరిపి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డీజీపికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర గనుల శాఖ అక్టోబర్‌ 18న లేఖ రాసింది. దీనికితోడు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంలో విఫలమైన జిల్లా గనులు, భూగర్భవనరులశాఖ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే అధికారులందరికీ షోకాజ్‌ నోటీసులిచ్చాం. ఇసుక అక్రమ తవ్వకాల చుట్టూ ఉన్న కార్యకలాపాలపై ఏసీబీ విచారణ కూడా చేయిస్తున్నాం. రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన ఇసుక తవ్వకాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ వ్యవహారంలో పారదర్శకత తీసుకొచ్చి, అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టడానికి ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ను ప్రారంభించాం’’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.

Also Read : Minister Konda Surekha : వరంగల్ రాష్ట్రానికి 2వ రాజధానిగా అభివృద్ధి చేసి చూపిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!