AP High Court: ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ ప్రమాణం
ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ ప్రమాణం
AP High Court : ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ప్రమాణస్వీకారం చేయించారు. తుహిన్ నియామకంతో హైకోర్టులో (AP High Court) న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
తుహిన్ కుమార్ స్వస్థలం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటి గ్రామం. 1994 మార్చి 9న బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఆయన పేరు నమోదైంది. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలు అందించారు. 2010-14 మధ్య జీఎంసీ తరఫున హైకోర్టులో (AP High Court) స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016-17లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
AP High Court – రఘురామపై పెట్టిన కేసును కొనసాగించలేను – సుప్రీంకోర్టు ఎదుట ఫిర్యాదుదారు ఫరూక్ బాషా
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసును ఇక కొనసాగించలేనని ఫిర్యాదుదారు ఫరూక్ బాషా సుప్రీంకోర్టుకు తెలిపారు. కేసును కొనసాగించేందుకు ఆయన సిద్ధంగా లేనట్లు సమాచారం పంపారని ఫరూక్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
2022 జూన్‌లో రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju), ఆయన కుమారుడు భరత్‌పై ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ కేసు పెట్టారు. హైదరాబాద్‌లో బౌల్డర్‌హిల్స్‌లో ఉన్న రఘురామ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. అతడిని రఘురామ, ఆయన భద్రతా సిబ్బంది కలిసి స్థానిక గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు.
మరోవైపు డ్యూటీలో ఉన్న తనపై దాడికి పాల్పడ్డారని అదే పీఎస్‌లో రఘురామకృష్ణ రాజు, ఆయన కుమారుడు భరత్, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కానిస్టేబుల్ ఫరూక్ ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈక్రమంలో తమ ఫిర్యాదు పట్టించుకోకుండా తమపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై హైకోర్టులో రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తాజాగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఫిర్యాదు చేసినవారిపైనే ఎదురు కేసు పెట్టారని రఘురామ తరఫు న్యాయవాది వాదనల సందర్భంగా తెలిపారు. వరుస ఘటనల వివరాలు కోర్టుకు అందించాలని రఘురామ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో ఫిర్యాదుదారు ఫరూక్ బాషా తరఫు న్యాయవాది జోక్యం చేసుకున్నారు. కేసు కొనసాగించేందుకు ఫిర్యాదుదారు సిద్ధంగా లేనట్లు సమాచారం పంపారన్నారు.
Also Read : AP Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
