AP Home Minister : విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ హోంమంత్రి

భవానీలకు సంబంధించి ప్రత్యేకమైన క్యూలైన్ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు...

Home Minister : దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి(Home Minister) మాట్లాడుతూ.. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని.. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్నీ పరిశీలించినట్లు తెలిపారు. క్యూ లైన్‌లో భక్తులతో కూడా మాట్లాడానని.. అందరూ ఏర్పాట్లు బాగున్నాయని ఆనందాన్ని వ్యక్తపరిచారని తెలిపారు.

Home Minister Visit

భవానీలకు సంబంధించి ప్రత్యేకమైన క్యూలైన్ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీఠం వేయడం కోసం అంతరాలయ దర్శనాన్ని ఈరోజు నిలిపివేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా బంగారపు వాకిలిలోనే దర్శనం చేసుకొని వెళుతున్నారని చెప్పారు. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. సీఎం వచ్చే సమయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేయమని స్పష్టం చేశారు. ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్లారు తప్ప భక్తులకు ఎక్కడ ఆటంకం కలిగించలేదని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

కాగా.. ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి హోం మినిస్టర్ అనిత పరిశీలించారు. క్యూ లైన్‌లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఏడో రోజుకి చేరుకున్నాయి. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట నుండి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు.

ఉత్సవాల సందర్భంగా అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనం కల్పించారు. అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి మరీ భక్తులు బారులు తీరారు. బాక్సుల విధానంలో రోప్‌ల‌ సాయంతో యాభై మంది చొప్పున భక్తులను క్యూలైన్‌లోకి పోలీసులు పంపుతున్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకుని సీపీ రాజశేఖర్ బాబు ముందస్తుగా అవసరమైన చర్యలు చేపట్టారు. కొండపైకి నేడు ఎటువంటి వాహనాలు అనుమతించమని పోలీసులు తేల్చిచేప్పారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను అందించనున్నారు. ఈరోజు మూడు గంటలకు ఇంద్రకీలాద్రి పైకి చంద్రబాబు, భువనేశ్వరి చేరుకోనున్నారు.

Also Read : Chevella MP : మైనారిటీలను మోదీ ఆదుకుంటే కాంగ్రెస్ వాడుకుంది

Leave A Reply

Your Email Id will not be published!