AP Liquor Scam : నిందితుల కస్టడీ పై ఏసీబీ కోర్టు తీర్పును మే 29 కి వాయిదా..
వీరిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు...
AP Liquor Scam : మద్యం కుంభకోణం కేసులో ముద్దాయిల కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు.. తన తీర్పును వాయిదా వేసింది. మే 29వ తేదీకి ఈ తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు సోమవారం వెల్లడించింది. మద్యం కుంభకోణంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో(ACB Court) సోమవారం ఉదయం వాదనలు జరిగాయి. వాదనలు విన్న కోర్టు… సాయంత్రం తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో తీర్పును రిజర్వు చేసింది. కానీ తీర్పును మే 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ఆ తర్వాత ప్రకటించింది.
AP Liquor Scam Victims
మద్యం కుంభకోణం కేసులో(AP Liquor Scam) కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కీలక సూత్రదారంటూ వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా మీడియా ముందు ప్రకటించారు. దీంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో మారు పేరుతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన అతడిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించి.. సిట్ పోలీసులు విచారించారు. అతడు చెప్పిన ఆధారాలతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిని సైతం విచారించారు. ఇక ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప కూడా అరెస్టయ్యారు.
వీరిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని సైతం మరోసారి తమ కస్టడీకి అప్పగించాలంటూ వారు కోర్టును కోరారు. ఆ క్రమంలో సోమవారం ప్రభుత్వం తరపు న్యాయవాది, సిట్ తరపు న్యాయవాదితోపాటు నిందితుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపించారు. దీంతో నిందితులను సిట్‌కు అప్పగించడంపై మే 29వ తేదీన తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
జగన్ ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఈ మద్యం తాగి వందలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పలువురు మరణించారు కూడా. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ మద్యం మాఫియాపై విచారణ జరుపుతామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో 2024 మే , జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు.. కూటమిలోని పార్టీలకు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) విచారణకు ఆదేశించింది.
Also Read : KTR Slams BJP : బీజేపీ పై వీడియోలతో సెటైర్లు విసిరిన కేటీఆర్