AP Mega DSC 2025 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తెస్తామన్నారు...

AP Mega DSC : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కార్.. మొత్తం 16,317 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ(AP Mega DSC) నోటిఫికేషన్‌ ఇస్తామని గత జూన్‌ నుంచి నిరుద్యోగులను ఊరిస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రాబాబు తొలి సంతకం కూడా మెగా డీఎస్సీపై పెట్టడం గమనార్హం. అయితే ఆ తర్వాత నాటకీయ పరిణామాల దృష్ట్యా డీఎస్సీ ప్రకటన వాయిదా వేశారు. నవంబర్ 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని చెప్పిన పాఠశాల విద్యాశాఖ హఠాత్తుగా ఈ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అప్పటినుంచి డీఎస్సీ నోటిఫికేషన్‌ అతీగతీ లేకుండా పోయింది. తాజాగా దీనిపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh) కీలక ప్రకటన జారీ చేశారు.

AP Mega DSC 2025 Updates

మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మార్చిలో ప్రారంభించి.. విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేశ్‌.. విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యాశాఖలో ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదిస్తున్నామని, ప్రతి శుక్రవారం పాఠశాల విద్య కమిషనర్‌ వారికి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రల్లో 80 శాతం ఉపాధ్యాయ పోస్టులు టీడీపీ హయాంలోనే భర్తీ అయ్యాయన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తెస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ల నివారణకు ప్రత్యేక వ్యవస్థ, విద్యార్థుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకునేందుకు అపార్‌ కార్డు విధానాల్ని తెస్తున్నట్లు వెల్లడించారు. కాగా కూటమి సర్కారు కొలువుతీరిన తొలిరోజునే 16,317 పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఎక్కువ ఖాళీలు భర్తీ చేయనుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి.

Also Read : CM Chandrababu : ఏపీ రైతన్నలకు రైతు భరోసాపై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!