AP Politics Comment : ఏపీ రణ క్షేత్రంలో రాజు ఎవరో
రాజకీయం రసకందాయం
AP Politics Comment : సమయం ఇంకా మిగిలే ఉంది మిత్రమా అని అనుకోవడానికి ఇదేం సినిమా కాదు. రాజకీయం(AP Politics) చేయాలంటే తెలివి ఉండాల్సిన పని లేదు. కాస్తంత నేర్పరితనం, అంతకు మించిన హంగు, ఆర్భాటం, ఆర్థిక, అంగ, కుల బలం ఉంటే చాలు. తెలంగాణలో రెడ్లు, వెలమల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. ఇక ఏపీలో కమ్మ , కాపు, రెడ్ల మధ్య త్రిముఖ పోరు జరిగేందుకు ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా తొణకడం లేదు. ఇప్పటికే చాప కింద నీరులాగా కూల్ గా పని చేసుకుంటూ పోతోంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు తమకు మళ్లీ ప్రజలు పట్టం కడతారని పూర్తి నమ్మకంతో ఉన్నారు ఆ పార్టీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. అంతే కాదు టార్గెట్ కూడా నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గడప గడపకు వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం తలమునకలై ఉంది. ఓ వైపు అప్పులు పెరుగుతున్నా ఎక్కడా జగన్ రెడ్డి సంక్షేమ బాట వీడడం లేదు. ఆయన ప్రధానంగా మూడింటిపై ఫోకస్ పెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం. ఆ తర్వాతే పరిశ్రమల ఏర్పాటు. జనానికి ఠంఛనుగా సర్కార్ ఫలాలు అందించేలా మెకానిజం ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు సీఎం.
ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దూకారు. సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజలపై అప్పుల భారం మోపుతున్నాడంటూ ఆరోపిస్తున్నారు. జనాన్ని చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. ఇక తన తనయుడు నారా లోకేష్ సైతం యువ గళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈసారి టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది.
ఇది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఏపీపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కనీసం స్థానాలను కైవసం చేసుకుని కీలకంగా మారాలన్నది ఆ పార్టీ ప్లాన్. అతిరథ మహారథులు ఇప్పటికే జల్లెడ్ పడుతున్నారు ఏపీని. మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ముందస్తు వ్యూహాలలో మునిగి పోయింది. వారాహి వాహన యాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. మరో వైపు వామపక్షాలు ఎటు వైపు ఉంటాయనేది తేల లేదు. మొత్తంగా ఏపీలో మాత్రం ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ రాజకీయం మాత్రం రంజుగా మారింది. చివరకు రాజు ఎవరో వచ్చే త్వరలోనే తేలనుంది.
Also Read : KRK Rahul Gandhi : కమాల్ ఖాన్ సర్వేలో రాహుల్ టాప్