AP Weather : కృష్ణా జిల్లాతో పాటు ఆ 7 జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు
కాగా.. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిలాల్లో ఫ్లాష్ ఫ్లాడ్స్ వచ్చే అవకాశం ఉంది...
AP Weather : ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఒకటి రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నాన్ స్టాప్‌గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల థాటికి విజయవాడ విల విల్లాడుతున్న సంగతి తెలిసిందే. వర్షాలు, వరద థాటి నుంచి తేరుకోకమునుపే విశాఖపట్నం(Visakhapatnam) వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో బెజవాడ వాసుల్లో మళ్లీ ఆందోళన మొదలయ్యింది. మరికాసేపట్లో పూరి తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత మరికొన్ని గంటలు తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది.
సోమవారం అర్ధరాత్రికి క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంద్రలో చాలా చోట్లా మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే.. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు మాత్రమే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather Update
కాగా.. విశాఖపట్నం(Visakhapatnam), తూర్పుగోదావరి జిలాల్లో ఫ్లాష్ ఫ్లాడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదై అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో సోమవారం సాయంత్రం వరకూ బలమైన గాలులు వీస్తాయి. రానున్న రెండు రోజులు మత్య్సకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంద్రలో ఉన్న అన్ని పోర్టులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా అల్లూరి జిల్లాలోని చింతపల్లిలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగలో 9 సెంటీమీటర్లు, విశాఖ ఎయిర్ పోర్టు వద్ద 9 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ నది వరద ఉధృతిని హోంమంత్రి వంగలపూడి అనిత(AP Home Minister) పరిశీలించారు. నదిని ఆనుకొని ఉన్న కాలనీలోని ప్రజలను పరామర్శించి అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆదివారం రోజునే ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను టెలీకాన్ఫరెన్స్‌లో సీఎంకు వివరించారు కలెక్టర్లు. తమ తమ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను సీఎంకు వివరించారు కలెక్టర్లు. ఈ సందర్భంగా సీఎం సైతం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. జిల్లాల్లో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోందని.. ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ ఫ్లో.. ఔట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలన్నారు.
Also Read : Ex Minister Prasanth Reddy : ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం