Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు !
కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు !
Arvind Kejriwal: లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయితే రూ. 50 వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై సమర్పించాలని కోర్టు ఆదేవించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..
Arvind Kejriwal Got Bail
కేజ్రీవాల్ కు జూన్ 5వ తేదీ వరకు (ఎన్నికల ఫలితాల మరుసటిరోజు) మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సీఎం కార్యాలయానికి గానీ.. ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని సూచించింది. మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది. తీర్పు అనంతరం సీఎం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. నేటి సాయంత్రంలోగా కేజ్రీవాల్(Arvind Kejriwal) జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా కోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. దీనికి ధర్మాసనం స్పందిస్తూ… ‘‘ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు’’ అని వ్యాఖ్యానించింది.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్(Arvind Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నారు. ఇదిలాఉండగా… తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్ సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది. అయితే మధ్యంతర బెయిల్ పై విడుదలైతే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించకూడదని తెలిపింది. ఫైళ్లపై ఎలాంటి సంతకాలు చేయొద్దని సూచించింది. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని తెలిపింది.
Also Read : Election Commission : ఖర్గే వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానమిచ్చిన ఎన్నికల సంఘం