Bangladesh Violance : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా పై మర్డర్ కేసు నమోదు
ఆగస్టు 5వ తేదీన ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో ఆమె ప్రభుత్వం రద్దయింది...
Bangladesh : బంగ్లాదేశ్‌లో అల్లర్ల నడుమ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాపై ఆ దేశంలో హత్య కేసు నమోదయింది. ఆమెతోపాటు మరో ఆరుగురిపై ఈ కేసు నమోదు చేసినట్లు బంగ్లాదేశ్(Bangladesh)లోని మీడియా మంగళవారం వెల్లడించింది. జులై 19వ తేదీన మొహమ్మద్‌పూర్‌లో రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో పోలీసుల కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయ్యద్ మరణించారు. దీంతో అతడి స్నేహితుడు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాడు. దీంతో నాటి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతోపాటు మరో ఆరుగురిపై పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు మీడియా తెలిపింది. ఈ కేసు నమోదయిన వారి జాబితాలో అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్, హోమ్ శాఖ మాజీ మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ ఐజీ చౌదరి అబ్దుల్ అల్ మమున్‌లతోపాటు పోలీస్ శాఖలో అత్యున్నత అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఉన్నట్లు మీడియాలో వార్త కథనాలు అయితే వెలువడ్డాయి.
Bangladesh Violance..
ఆగస్టు 5వ తేదీన ప్రధాని పదవికి షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేశారు. దీంతో ఆమె ప్రభుత్వం రద్దయింది. అనంతరం దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనల్లో దేశంలో 230 మందికిపైగా మరణించారు. ఇక ఈ ఏడాది జులైలో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రభుత్వం కర్ప్యూ విధించింది. ఈ సందర్బంగా దేశంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 560 మంది మరణించిన విషయం విధితమే. షేక్ హసీనా ప్రభుత్వం రద్దయిన అనంతరం పాలన సైనికుల చేతిలోకి వెళ్లింది. ఆ క్రమంలో బంగ్లాదేశ్‌లో విద్యార్థి సంఘాల నాయకులతో పలు దఫాల సమావేశం జరిగింది. దీంతో ప్రొ. యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు.. ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రొ యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరింది.
మరోవైపు ప్రొ. యూనుస్‌తో బంగ్లాదేశ్(Bangladesh)లోని వివిధ రాజకీయ పార్టీల నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేలా చూడాలని ప్రొ. యూనుస్‌కు వారు విజ్జప్తి చేశారు. అయితే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈ మధ్యంతర ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని బంగ్లాదేశ్ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫఖ్రల్ ఇస్లాం అలీంఘర్ పేర్కొన్నారు. అలాగే ఈ మధ్యంతర ప్రభుత్వానికి తాము సంపూర్ణ మద్దతు ఉంటుందని అలీంఘర్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో నాయకులు, ప్రతిపక్ష పార్టీల నేతలపై పెట్టిన కేసులను తొలగించాలని ప్రొ. యూనుస్‌కు విజ్జప్తి చేసినట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్ జాతీయ పార్టీ అధ్యక్షురాలు బేగం ఖలిదా జీయా జైలు నుంచి ఇటివల విడుదలైన సంగతి తెలిసిందే.
Also Read : Minister Seethakka : ‘స్వచ్చందం-పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి