Sheikh Hasina : అమెరికాపై మాజీ బాంగ్లాదేశ్ ప్రధాని సంచలన ఆరోపణలు
నేను దేశంలోనే ఉండి ఉంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేవారు...
Sheikh Hasina : ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్(Bangladesh) ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి.. భారత్‌కు పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే. భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న ఆమె అగ్రరాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేసినట్టుగా కథనాలు వెలువుడుతున్నాయి. తనను పదవి నుంచి దించడం వెనుక అమెరికా పాత్ర ఉందని హసీనా ఆరోపించారని ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. తనను అధికారం నుంచి తప్పించేందుకు పెద్ద కుట్ర పన్నారని ఆమె చెప్పినట్టు రిపోర్ట్ పేర్కొంది. ‘ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని’ ఇవ్వడానికి నిరాకరించినందుకే తనను పదవి నుంచి తొలగించాలని అమెరికా యోచించిందని, ఈ ద్వీపాన్ని అప్పగిస్తే బంగాళాఖాతంపై అమెరికా ప్రభాల్యం పెరిగే అవకాశం ఉంటుందని హసీనా అన్నారని పేర్కొంది.
Sheikh Hasina Comments..
విద్యార్థుల శవాలను అడ్డం పెట్టుకొని వారు అధికారంలోకి రావాలని చూశారని, కానీ మృతదేహాల ఊరేగింపును చూడడం ఇష్టంలేక ప్రధానమంత్రి పదవికి తాను రాజీనామా చేశానని ఆమె వెల్లడించారు. ‘‘ నేను ప్రధాని పదవికి రాజీనామా చేశాను. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అప్పగించి బంగాళాఖాతంపై అమెరికా పట్టు సాధించడానికి అంగీకరిస్తే నేను అధికారంలో ఉండగలను’’ అని షేక్ హసీనా(Sheikh Hasina) చెప్పినట్టు ‘ఎకనామిక్ టైమ్స్’ టైమ్ పేర్కొంది.
“నేను దేశంలోనే ఉండి ఉంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేవారు. మరిన్ని వనరులు నాశనం అయ్యేవి. చాలా కష్టంగా అనిపించినప్పటికీ అక్కడి నుంచి నిష్ర్కమించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. నన్ను ఎన్నుకున్నారు కాబట్టే నేను ప్రజల నాయకురాలు అయ్యాను. మీరు నా బలం” అని హసీనా పేర్కొన్నారు. కాగా అవామీ లీగ్ పార్టీ నాయకుల హత్యలపై హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. “ చాలా మంది నాయకులు హత్యకు గురయ్యారు. కార్మికులు వేధింపులకు గురవుతున్నారని, వారి ఇళ్లను ధ్వంసానికి, దహనానికి గురవుతున్నాయనే వార్తలు నన్ను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అల్లా దయతో నేను త్వరలో తిరిగి ప్రవేశిస్తాను. అవామీ లీగ్ పార్టీ మళ్లీ మళ్లీ నిలబడుతుంది. నా తండ్రి కృషి ఫలితంగా ఏర్పడిన నా దేశం బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తూనే ఉంటాను. దేశం కోసం నా తండ్రి, కుటుంబం వారి ప్రాణాలను అర్పించారు’’ అని షేక్ హసీనా భావోద్వేగంతో మాట్లాడారు.
కాగా విద్యార్థులను తానెప్పుడూ రజాకార్ అని పిలవలేదని, తన ప్రకటనను వక్రీకరించారని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. రిజర్వేషన్ల కోటా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఆందోళనకారులను రెచ్చగొట్టేలా తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. “ ఈ విషయాన్ని నేను బంగ్లాదేశ్ యువ విద్యార్థులకు మరోసారి స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేనెప్పుడూ మిమ్మల్ని రజాకార్లు అనలేదు. మిమ్మల్ని ప్రేరేపించడానికి నా మాటలను వక్రీకరించారు. ఆ రోజు నేను మాట్లాడిన పూర్తి వీడియోను చూడాల్సిందిగా కోరుతున్నాను. అమాయకత్వాన్ని ఉపయోగించుకుని కుట్రదారులు దేశాన్ని అస్థిరపరిచేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు” అని షేక్ హసీనా పేర్కొంది.
Also Read : DK Shiva Kumar : తుంగభద్ర డ్యామ్ గేట్ డ్యామేజ్ పై స్పందించిన డీకే శివకుమార్