BCCI Comment : క్రికెట్ పండుగ సరే సెలెక్షన్ మాటేంటి
వివాదాలకు కేరాఫ్ గా మారిన బీసీసీఐ
BCCI Comment : కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఏకైక క్రీడా సంస్థ భారత దేశానికి చెందిన బీసీసీఐ. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. క్రికెట్ ఎప్పుడైతే మతం కంటే ఎక్కువగా మారి పోయిందో దాని వెనుకాల రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు ప్రతిభ కలిగిన వాళ్లకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్న విమర్శలు లేక పోలేదు. జట్టు తరపున ఆడేది కేవలం 11 మంది ఆటగాళ్లు. 137 కోట్లకు పైగా ఉన్న భారత దేశంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి. కానీ ఏ ఆటకు లేనంతగా క్రికెట్ కు జనాదరణ ఉంది. నిన్నటి దాకా క్రికెట్ అంటే ఈసడించుకుంటూ వచ్చిన పెద్దన్న అమెరికా సైతం ఇప్పుడు ఆడేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఏకంగా వచ్చే ఏడాది 2024లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే టి20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ తో కలిసి అమెరికా కూడా ఆతిథ్యం ఇవ్వబోతోంది.
BCCI Comment Viral
అమెరికా మార్కెట్ ను, క్రీడా రంగాన్ని శాసించే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు ఇప్పుడు మిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ఒక రకంగా ఫుట్ బాల్ , టెన్నిస్ , గోల్ఫ్ కు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు క్రికెట్ రాజ్యం ఏలేందుకు రెడీ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి పోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ(BCCI) ప్లాన్ చేస్తోంది. కానీ ఇదే సమయంలో కేవలం దేశంలోని కొన్ని ప్రాంతాలకే ప్రయారిటీ ఇవ్వడం, కొందరు ఆటగాళ్లను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. క్రికెట్ కు సంబంధించి దేశం తరపున ఆడాలని, జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
ఇతర దేశాలలో క్రికెట్ ను ఒక ఆటగా ఆడతారు. అక్కడి దేశాలు, క్రీడాభిమానులు స్పోర్టివ్ గా తీసుకున్నారు. కానీ భారత దేశంలో అలా కాదు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇక్కడి ప్రజలు, క్రికెట్ ప్రేమికులు తామే ఆటగాళ్లుగా భావిస్తారు. దేవుళ్ల కంటే ఎక్కువగా క్రికెటర్లను కొలుస్తారు. ఇక్కడ క్రికెట్ మతం కంటే ప్రమాదకరంగా తయారైంది. కారణం కోట్లాది రూపాయలు ఆదాయం కురిపించేలా చేస్తోంది క్రికెట్. దీనిని ఆసరాగా చేసుకుని బీసీసీఐ ఆటగాళ్లను పావులుగా వాడుకుంటోంది. ప్రత్యేకించి కార్పొరేట్ కంపెనీల మాయాజాలం, ప్రభావం క్రీడా సంస్థపై పడుతోంది.
గతంలో ఆటకు సంబంధించిన వాళ్లు బీసీసీఐలో ఉండేవాళ్లు. కానీ సీన్ మారింది. ఇప్పుడు పాలిటిక్స్ కు కేరాఫ్ గా మారింది బీసీసీఐ(BCCI). ఇక ముంబైకి చెందిన లాబీయింగ్ జట్టు ఎంపిక లో ఎక్కువగా పని చేస్తోందన్న అపవాదు లేక పోలేదు. మొత్తంగా ప్రధాన జట్టుతో పాటు మరో జట్టును కూడా బీసీసీఐ తయారు చేస్తే వర్దమాన క్రికెటర్లకు ఒకింత ఊరట ఇచ్చినట్టువుతుందని క్రికెట్ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా క్రికెట్ సంబురం సరే కానీ ప్రతిభకు పాతర వేయడం మాత్రం ఎవరూ ఒప్పుకోరు. బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తుందని కోరుకుందాం.
Also Read : Motkupalli Narsimhulu : బాబుకు ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యత