Big Fight Comment : ఎల‌క్ష‌న్ వార్ లో నువ్వా నేనా

హ‌స్తం..క‌మ‌లం..గులాబీ మ‌ధ్యే పోటీ

Big Fight Comment : తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ ఎక్కింది. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌ధాన పార్టీలు పోటా పోటీగా నెల‌కొన్నాయి. అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి మ‌రోసారి ముచ్చ‌ట‌గా ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. తాము చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని భావిస్తున్నారు ఆ పార్టీ బాస్, సీఎం కేసీఆర్. ఆయ‌న‌కు తిమ్మిని బిమ్మిని చేస్తార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. నీళ్లు, నిధులు, నియామ‌కాల ట్యాగ్ లైన్ పేరుతో తెలంగాణ ఉద్య‌మాన్ని త‌న భుజాల మీద మోసిన ఘ‌న‌త కేసీఆర్(KCR) కు ద‌క్కుతుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన త‌ర్వాత తొలిసారి జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డం విశేషం. దక్షిణాదిలో కీల‌క‌మైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. దేశంలో కీల‌క‌మైన పాత్ర పోషించాల‌ని అనుకుంటున్న కేసీఆర్ స‌మ‌ర్థ‌త‌కు , అపార‌మైన నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌కు పెట్టింది పేరు . 119 నియోజ‌వ‌ర్గాల‌కు సంబంధించి ముంద‌స్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు.

Big Fight Comment Viral

చాలా మందిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ బాస్ ఉన్న‌ట్టుండి 115 సీట్ల‌ను ఖ‌రారు చేశారు. బీ ఫార‌మ్ లు కూడా ఇచ్చేశారు. రైతు బంధు, ఆస‌రా పెన్ష‌న్లు, ద‌ళిత బంధు, బీసీ బంధు, ధ‌ర‌ణి ద్వారానే ఓట్లు రాలుతాయ‌ని భావిస్తున్నారు కేసీఆర్(KCR). సీఎంగా కొలువు తీరి 10 ఏళ్ల‌వుతోంది. కానీ నీళ్లు, నిధుల‌న్నీ గులాబీ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల దోచుకునేందుకు దోహ‌ద ప‌డ్డాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం నిశ్శ‌బ్ద విప్ల‌వం కొన‌సాగుతోంది. ఓట‌ర్లు ఎవ‌రి వైపు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. గ‌తంలో కేటీఆర్ చెప్పిన‌ట్లు 100 సీట్లు రావ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది.

ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కు పోటీగా మారింది. ప్ర‌ధానంగా యంగ్ లీడ‌ర్ గా గుర్తింపు పొందిన ఎంపీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ గా ఎన్నిక‌య్యారో ఆనాటి నుంచి సీన్ మారింది. పార్టీలో జోష్ పెరిగింది. ఈసారి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకు పోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించింది. వీటికి ప్ర‌జ‌ల నుంచి భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇక కాంగ్రెస్ త‌ర్వాత విడుద‌ల చేసిన బీఆర్ఎస్ మేనిఫెస్టో చప్ప‌గా ఉంద‌ని ఆరోప‌ణలున్నాయి. 119 సీట్ల‌కు గాను 55 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది సీఈసీ. ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది. అస‌మ్మ‌తి సెగ కూడా ఆ పార్టీని వెంటాడుతోంది. ప్ర‌ధానంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల‌కు రేటు పెట్టాడ‌ని ఏకంగా ఆయ‌న‌కు కొత్త పేరు కూడా పెట్టారు. అదే రేటెంత రెడ్డి అని. ఇది ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

మ‌రో వైపు ప్ర‌ధాన పార్టీగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ మొద‌ట్లో జోష్ లో ఉండేది. కానీ ఎప్పుడైతే బండి సంజ‌య్ కుమార్ ను ప‌క్క‌న పెట్ట‌డంతో ఉన్న‌ట్టుండి ఆ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న స్థానంలో కూల్ గా పేరుండే గంగాపురం కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ఒకింత ఆ పార్టీ శ్రేణుల‌ను నిరాశ‌కు గురి చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను, మేని ఫెస్టోను ప్ర‌క‌టించ లేదు. ఇక బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ఎంఐఎం పార్టీలు సైతం ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌నున్నాయి. తాజాగా ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బేష‌ర‌తుగా బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు. మొత్తంగా దేశంలోని 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ఎక్కువ‌గా తెలంగాణ‌పై ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంది. ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తార‌ని వేచి చూడాలంటే డిసెంబ‌ర్ 3 దాకా వేచి ఉండాలి. ఏది ఏమైనా హ‌స్తం వ‌ర్సెస్ గులాబీ మ‌ధ్యే పోటీ ఉండ‌నుంది.

Also Read : Nadendla Manohar : ఇన్ఫోసిస్ తో జ‌గ‌న్ కు ఏం సంబంధం

Leave A Reply

Your Email Id will not be published!