BJP Candidate Mukesh Dalal: బీజేపీ ఖాతాలో సూరత్‌ లోక్ సభ సీటు ! ఏకగీవ్రంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక !

బీజేపీ ఖాతాలో సూరత్‌ లోక్ సభ సీటు ! ఏకగీవ్రంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక !

BJP Candidate Mukesh Dalal: లోక్‌సభ ఎన్నికల ఆరు దశలు ఇంకా మిగిలి ఉండగానే బీజేపీ ఖాతా తెరిచింది. గుజరాత్‌ లో సూరత్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌(Mukesh Dalal) ‘ఏకగ్రీవంగా’ ఎన్నికైనట్లు స్థానిక ఎన్నికల అధికారి సోమవారం ప్రకటించారు. ఈ మేరకు దలాల్‌ కు ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించారు. ప్రస్తుతం ఈ ధ్రువీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

BJP Candidate Mukesh Dalal..

సూరత్‌ బరిలో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన నీలేశ్‌ ఖుంభానీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆయన నామినేషన్‌ పత్రాలపై ముగ్గురు చేసిన సంతకాలు అసలైనవి కాదని తేలిందని రిటర్నింగ్‌ అధికారి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీలేశ్‌ ఖుంభానీకి 24 గంటల్లో స్పందించాలని నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. అయితే, ఆయన ఎన్నికల అధికారి కార్యాలయానికి తన అడ్వకేట్‌తో కలిసి వచ్చినప్పటికీ… ఆయన వెంట ముగ్గురు ప్రతిపాదకులు రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేష్‌ పడ్సాలా నామినేషన్‌ పత్రాలను కూడా ప్రతిపాదకుల సంతకాలు సరైనవి కావని తేలటంతో తిరస్కరించినట్లు పేర్కొన్నారు. బరిలో ఉన్న ఒక బిఎస్పీ అభ్యర్ధితో సహా ఎనిమిది మంది ఇండిపెండెంట్లు కూడా నామినేషన్‌ పత్రాల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీనితో బరిలో ఉన్న ఏకైక అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌(Mukesh Dalal) ఏకగ్రీవ విజయం సాధించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

అయితే ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఖుంబానీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ముగ్గురూ ఆయన బంధువులేనని, వారిని (బీజేపీ వాళ్లు) కిడ్నాప్‌ చేశారని, దీనివల్లే వారు రాలేకపోయారని కాంగ్రెస్‌ నేత, న్యాయవాది బాబూ మంగూకియా తెలిపారు. గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శక్తిసింగ్‌ గోహిల్‌ మాట్లాడుతూ, తమ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు.

Also Read:Kolkata High Court: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ! 25 వేల ఉపాధ్యాయ నియామకాలు రద్దు !

Leave A Reply

Your Email Id will not be published!