M. Venkaiah Naidu: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడు !

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడు !

M. Venkaiah Naidu: పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు(M. Venkaiah Naidu) పద్మ విభూషన్ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాదికి గాను 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ తరఫున కుటుంబ సభ్యులు పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు. సినీ నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్ నాయక్, ప్రముఖ గాయనీ ఉషా ఉథుప్ పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.

M. Venkaiah Naidu – పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేతావత్‌ సోమ్లాల్‌

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేటకు చెందిన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం నిర్వహించిన పద్మ అవార్డుల ప్రథానోత్సవ కార్యక్రమంలో సగం మందికి అవార్డులను ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఎన్నడూ ఊహించలేదు -వెంకయ్యనాయుడు

తనకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(M. Venkaiah Naidu) ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు దేశానికి తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. ‘‘నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు బిడ్డను ఇంత అత్యున్నత పురస్కారానికి అర్హుడిగా గుర్తిస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. సుదీర్ఘ ప్రజాజీవితంలో నాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆ కష్టాలన్నింటినీ అధిగమించి, రాజ్యాంగపరంగా రెండో అత్యున్నత పీఠమైన ఉప రాష్ట్రపతి స్థాయికి చేర్చిన ఘనత అంతా ఆ దేవుడికే చెందుతుంది. ఈ అవార్డును ప్రజాజీవితంలో నేను కట్టుబడిన విలువలకు, సమాజానికి నా వంతు చేసిన సేవలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుదిశ్వాస వరకూ దేశసేవలో నిమగ్నమై ఉండాలన్నదే నా సంకల్పం’’ అని అవార్డును స్వీకరించిన అనంతరం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 132 మందికి పౌర పురస్కారాలు ప్రకటించింది. అందులో 66 మందికి సోమవారం అవార్డులు అందించారు. మిగిలినవారికి మరో విడత ప్రదానం చేయనున్నారు. అందులో సినీనటుడు చిరంజీవి పద్మవిభూషణ్‌ అందుకోనున్నారు.

Also Read:BJP Candidate Mukesh Dalal: బీజేపీ ఖాతాలో సూరత్‌ లోక్ సభ సీటు ! ఏకగీవ్రంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక !

Leave A Reply

Your Email Id will not be published!