Bosta Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక !
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక !
Bosta Satyanarayana: స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సర్టిఫికెట్ ను బొత్స సత్యనారాయణ(Bosta Satyanarayana)కు అందించారు. ఈ కార్యక్రమంలో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువరు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దీనితో విశాఖ కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడం చాలా సంతోషంగా ఉంది. ‘నాకు బీఫామ్ ఇచ్చిన మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రావణ శుక్రవారం మంచి రోజు.. రాష్ట్ర ప్రజలందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం జిల్లా అభివృద్ధి కూడా ఇలాగే అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తాను’ అని బొత్స మీడియాకు వెల్లడించారు.
Bosta Satyanarayana – ఏకగ్రీవం ఇలా..!
ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి స్వతంత్య్ర అభ్యర్థి షేక్ షఫీ, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ(Bosta Satyanarayana) తరపున ఆయన ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని పత్రాలు ఉండడంతో రెండు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. స్వతంత్య్ర అభ్యర్థి షేక్ షఫీ తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు బుధవారమే పత్రాలు దాఖలు చేశారు. దీనితో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో ఉన్నట్టు అయ్యింది. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాతే అధికారికంగా బొత్స సత్యనారాయణ ఎన్నికను ప్రకటించాల్సి ఉంది. దీనితో శుక్రవారం నాడు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Also Read : Telangana Rythu Bandhu 2024: మూడు విడతల్లో రూ.17,933 కోట్ల రుణమాఫీ – తెలంగాణా ప్రభుత్వం