BRS BJP Alliance: తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల పొత్తు ఫైట్ ?
తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల పొత్తు ఫైట్ ?
BRS BJP Alliance: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పటికీ… మరో రెండు మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తు అంశాలు తెరమీదకు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు బద్ద శత్రువుగా మారడంతో… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో(BJP) బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనితో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈ పొత్తు అంశంపై సీరియస్ గా స్పందిస్తున్నారు. బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి బాల్క సుమన్ ఈ పొత్తు అంశంపై పరుష పదజాలాలతో తెలంగాణా రాజకీయాలను వెడెక్కిస్తున్నారు.
BRS BJP Alliance – పొత్తుల్లేవు.. గిత్తుల్లేవు – బాల్క సుమన్ !
రాజకీయ చర్చల కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారన్న వార్తలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. “మేము కిషన్ రెడ్డి తో ఏమైనా ఎప్పుడైనా పొత్తుల గురించి ఊసెత్తమా ? బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు ? బీఆర్‌ఎస్(BRS) ఒక సెక్యులర్ పార్టీ, మా నాయకుడు కెసిఆర్ ఒక సెక్యులర్ నాయకుడు. ఇలాంటి వార్తలకు లీకులు ఇచ్చేది బీజేపీనే. అలాగే వార్తలు రాయించేది బీజేపీనే. బీజేపీతో మా పార్టీకు పొత్తుల్లేవు.. గిత్తుల్లేవు” అంటూ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు.
పొత్తు అనేవాడి చెంప చెల్లుమనిపించండి – కిషన్ రెడ్డి
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ‘తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న… బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందనే దుష్ప్రచారాన్ని నమ్మకండి. మెడ మీద తలకాయ లేనోడే బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్‌తో బీజేపీ కలుస్తుందా ? ఎందుకు కలుస్తుంది ? అలా అనుకున్నోడు మూర్ఖుడు. మూర్ఖత్వంతోనే బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అనేవి పనికిరాని మాటలు. కుట్రపూరితంగా బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారు. మూర్ఖులు, దుర్మార్గులు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ ఖాతర్ చేయదు. ‘ఎవరైనా బీఆర్ఎస్, బీజేపీ పొత్తు గురించి మాట్లాడితే లాగి చెంప చెళ్లుమనిపించండి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read : Akhilesh Yadav: కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ ఓపెన్ ఆఫర్ ! 17 సీట్లు ఫైనల్ !