Telangana Assembly: శాసనసభలో దుమారం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు
శాసనసభలో దుమారం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు
Telangana Assembly : ప్రభుత్వ పనుల్లో కమీషన్లపై అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల వాదోపవాదాలతో తెలంగాణా అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) పేర్కొనడం… అతని వ్యాఖ్యలను ఖండిస్తూ ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేటీఆర్(KTR) వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్(Congress) సభ్యులు సభలో ఆందోళన చేశారు. బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు… కాంగ్రెస్ క్షమాపణల్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యులు పోడియం ముందుకు వచ్చి భట్టి వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. దీంతో సభలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది.
Telangana Assembly-KTR Comments
రెవెన్యూ, గృహ నిర్మాణం పద్దులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ… ‘‘సభలో ఎన్ని సార్లు అంతరాయం కలిగిస్తారు? మంత్రులు అలా మాట్లాడితే ఎలా? ప్రతిపక్షాలు సహజంగానే ప్రభుత్వం అమలు చేయని హామీలను, చేయని పనులను ఎత్తి చూపుతాయి. 30 శాతం కమీషన్ అని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20 శాతం కమీషన్ అని సచివాలయంలో ధర్నాలు అవుతున్నాయి’’ అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేము ఓ బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రంలో పడి బరితెగించి దోపిడీ చేయడానికి రాలేదు. ప్రజలకు సేవ, మేలు చేయాలని వచ్చాం. వివిధ వర్గాలను ఆదుకోవడానికి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నాం. మాట్లాడేది నిజమో కాదో తెలుసుకుని మాట్లాడాలి’’ అని బీఆర్ఎస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే 30 శాతం కమీషన్ అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. ‘బట్టలు ఊడతీసి కొడతాం.. ఒళ్లు దగ్గర పెట్టుకో..’ వంటి వ్యాఖ్యలు చేయవచ్చా, ఇవీ అనుచిత వ్యాఖ్యలు కావా అంటూ బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. ఈ గందరగోళం మధ్యలోనే భట్టి(Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యలపై తనకు మాట్లాడడానికి అవకాశం కల్పించాలని కేటీఆర్ కోరారు. అందుకు ప్యానల్ స్పీకర్ ఒప్పుకోలేదు. దీనితో భారాస సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
బీఆర్‌ఎస్ సభ్యుల నిరసన
కేటీఆర్‌ను ఉద్దేశించి ‘ఒళ్లు బలిసి’అంటూ భట్టి తప్పుడు మాటలు మాట్లాడరంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మళ్లీ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ దగ్గరికి దూసుకెళ్లారు. మొదట కేటీఆరే రెచ్చగొట్టారని, ఒకట్రెండు అన్‌పార్లమెంటరీ పదాలుంటే తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిరసన కొనసాగించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాత్రమే తాను సూచించానని భట్టి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ప్యానల్ స్పీకర్ ఆయన మైక్ కట్ చేసి బీజేపీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా ‘వద్దురా నాయనా.. ట్వంటీ పర్సెంట్ పాలన’అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు.
అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చు అయింది. అదనంగా రూ.1,11,477 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
కాగ్ నివేదిక ప్రకారం..
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా రూ.10,156 కోట్లు తీసుకున్న ప్రభుత్వం
రూ.35,425 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్‌ను 145 రోజుల పాటు వాడుకుంది
2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం రూ.24,347 కోట్ల వ్యయం
వేతనాలకు రూ.26,981 కోట్లు ఖర్చు
ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు
2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు మొత్తం రూ.9,934 కోట్లు
రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే ఖర్చు
రెవెన్యూ మిగులు రూ.779 కోట్లు
రెవెన్యూ లోటు రూ.49,977 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.33 శాతం
2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు
2023-24 ముగిసే వరకు జీఎస్డీపీలో అప్పులు 27 శాతం
2023-24 వరకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ.2,20,607 కోట్లు
2023-24లో మూలధనం కింద రూ.43,918 కోట్ల ఖర్చు
స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.76,773 కోట్లు
స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 11 శాతం పెరుగుదల
Also Read : Bhadrachalam: భద్రాచలంలో కూలిన ఐదంతస్తుల భవనం ! కొనసాగుతున్న సహాయక చర్యలు !