CBI Investigation on Doctor Rape Case: కోల్ కత్తా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కీలక పురోగతి !
కోల్ కత్తా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కీలక పురోగతి !
CBI Investigation: కోల్ కత్తాలోని ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
CBI Investigation…
ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు డాక్టర్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులు విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టును సీబీఐ అనుమతి కోరింది. సీబీఐ(CBI) అభ్యర్థన పట్ల కోల్‌కతా హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర సందీప్ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నించింది. ట్రైయినీ వైద్యురాలి మృతి చెందిన అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపై సీబీఐ సందేహాలు వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే… ఈ ఘటన అనంతరం ఆయన పలువురిని సంప్రదించినట్లు సమాచారం. అలాగే బాధితురాలి తల్లిదండ్రులను ఆమె మృతదేహాన్ని చూడడానికి అనుమతించడంలో ఆయన తీవ్ర జాప్యాన్ని ప్రదర్శించారని తెలుస్తుంది. కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు వారు ఆసుపత్రి వద్ద దాదాపు 3 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఓ ప్రచారం సైతం సాగింది.
అందుకు గల కారణాలేమిటంటూ డాక్టర్ సందీప్ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ ప్రశ్నలు సంధించింది. ఆ క్రమంలో ఆయనతోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ(CBI) నిర్ణయించినట్లు తెలుస్తుంది. హత్యాచార ఘటన అనంతరం దీనిని కప్పిపుచ్చుకోవడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే సీబీఐ ఆరోపించిన విషయం విధితమే.
ఈ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజులకు కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో పదవిలో నియమించింది. ఈ ఘటనపై ఆయన స్పందించారు. మృతురాలు తన కుమార్తె వంటిదని ఆయన అభివర్ణించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని ఎక్స్ వేదికగా ప్రొ. సందీప్ ఘోష్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.
Also Read : Doctors Strike: సుప్రీంకోర్టు సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు !