CBN Tour : నిలిచిపోయిన ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరిన బాబు

ఆ తర్వాత జిల్లా పర్యటన సమయంలో పోలవరం వెళ్లేందుకు ప్రయత్నించిన బాబు....

CBN Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమీక్షిస్తారు. అసలు పోలవరంలో ఏం జరుగుతోంది…? ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకొచ్చింది…? గత ప్రభుత్వం ఏ మేరకు పనులు చేసింది..? ఇలాంటి అంశాలను తెలుసుకుని… నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు పోలవరం వెళ్తున్నారు చంద్రబాబు. సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం వైపే అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఇవాళ్టి నుంచి ఫీల్డ్‌లోకి ఎంటర్‌ కానున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు… తొలుత పోలవరం వెళ్లనున్నారు.

CBN Tour to Polavaram

పోలవరం పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్నీ పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. స్పిల్‌వే పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఎగువ కాపర్‌ డ్యామ్, దిగువ కాపర్‌ డ్యామ్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్‌ శాఖ అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో భేటీ అయ్యి… అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా వారికి టైమ్‌ బౌండ్‌ కార్యక్రమాన్ని నిర్దేశించనున్నారు సీఎం చంద్రబాబు. 2019 జనవరి 7న ముఖ్యమంత్రి హోదాలో చివరి సారి చంద్రబాబు సందర్శించారు.

ఆ తర్వాత జిల్లా పర్యటన సమయంలో పోలవరం వెళ్లేందుకు ప్రయత్నించిన బాబు.. రాత్రి అయిందని ప్రొజెక్ట్ వద్దకు వెళ్లనీయక పోవటంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక నేడు ముఖ్యమంత్రి హోదాలో పోలవరం పర్యటనకు వెళ్తున్నారు. చంద్రబాబు(Chandrababu) సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం పనుల పరిశీలనకు వస్తుండటంతో… అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాజెక్టు హెలిప్యాడ్‌ పరిసరాలను శుభ్రం చేశారు. చంద్రబాబు హయాంలో వేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలకు మెరుగులు దిద్దారు. ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హిల్‌వ్యూ పరిసరాలను క్లీన్‌ చేశారు. అంతేకాదు… సీఎం టూర్‌ నేపథ్యంలో పోలవరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరోవైపు భారీగా టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. చంద్రబాబు(ChandrababuChandrababu) పోలవరం పనుల పరిశీలనకు రానుండటంతో.. ముందుగా ఏర్పాట్లను పరిశీలించారు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం టూర్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కనీసం 2 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ముంచేసిందన్నారు. మొత్తంగా… పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. వీలైనంత తర్వగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులోభాగంగానే సోమవారం పనులను పరిశీలించేందుకు వెళ్తున్నారు.

Also Read : Budget 2024 : ఈ బడ్జెట్ లో సామాన్యులకు ఆ పన్నుల్లో మినహాయింపా..?

Leave A Reply

Your Email Id will not be published!