Chandrababu Naidu: తన హెల్త్ సీక్రెట్ ను బయటపెట్టిన సీఎం చంద్రబాబు
తన హెల్త్ సీక్రెట్ ను బయటపెట్టిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని వయసు ఏడు పదులు దాటినప్పటికీ… పని విషయంలో మాత్రం అతనితో పోటీ పడే యువకులు కూడా రాజకీయాల్లో లేరని చెప్పవచ్చు. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఒక మిషన్ లా పనిచేస్తుంటారు. కాళ్ళకు చక్రాలు కట్టినట్లు దేశం అంతా తిరుగుతూ… ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఉదయం ఢిల్లీలో మధ్యాహ్నం హైదరాబాద్ లో సాయంత్రం విశాఖలో రాత్రికి అమరావతిలో ఇలా ఒకే రోజు నాలుగైదు రాష్ట్రాల్లో సభలు, సమావేశాలకు హాజరవుతుంటారు. అయితే ప్రజల్లో ఎంత సేపు ఉన్నప్పటికీ… ఇప్పటికీ క్రమం తప్పుకుండా ఉదయాన్నే యోగా, వాకింగ్ వంటి శారీరక వ్యాయామం చేస్తుంటారు. పరిమితమైన ఆహారం, నిరంతరం పని మీద ధ్యాస చంద్రబాబు(Chandrababu Naidu) ఆరోగ్యానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
Chandrababu Naidu Comment
ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ? అని అర్ధవీడుకు చెందిన వైద్య విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) ఆసక్తికర సమాధానమిచ్చారు. అంతేకాదు సీఎం తన ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకొనే వరకూ పనిలోనే ఉంటాను. మీ కన్నా చురుగ్గా, కొంత మంది యువకుల కన్నా ముందు చూపుతో ఉంటా. ప్రజలకు మంచి చేయాలనే స్వార్థం ఉంది. ఆ మంచి పేరు దక్కించుకోవాలని నిరంతరం ఆలోచిస్తా. అందువల్ల ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ఉంటా.
మన నాలుకే మన శత్రువు. మిఠాయిలు చూస్తే తినాలనిపిస్తుంది… అలా నియంత్రణ కోల్పోతే మధుమేహం వస్తుంది. అక్కడితో ఆగదు మరికొన్ని వ్యాధులు వస్తాయి. అందువల్ల ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. చాలా వరకు మందులకు అలవాటు పడకూడదు. ఒకసారి శరీరం మందులకు అలవాటు పడితే డోస్ పెంచుకుంటూ పోవాల్సిందే. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముంది. మన ఆరోగ్యం పట్ల నిత్యం పర్యవేక్షణ ఉండాలి. నేను ఓ ఉంగరాన్ని ధరిస్తా. ఇది ఎలక్ట్రానిక్ డివైజ్… నా ఆరోగ్య సమాచారాన్ని పర్యవేక్షిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నా’’ అని చంద్రబాబు వివరించారు.
Also Read : Posani Krishna Murali: పోసానికి మార్చి 20 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు