Chennai Rains : చెన్నైలో కుండపోత వర్షాలు..నదుల్లాపారుతున్న వీధులు

మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది...

Chennai Rains : ఆకాశానికి చిల్లిపడిందా? వరుణుడు విరామం మరిచాడా?.. అన్నట్లుగా చెన్నై(Chennai)లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం మంగళవారం రాత్రి వరకు పడుతూనే వుండడంతో నగరం జలసంద్రంగా తయారైంది. వీధులన్నీ నదుల్లా, వాడలన్నీ చెరువుల్లా తయారయ్యాయి. దీంతో చెన్నై(Chennai)లో జనజీవనం స్తంభించింది. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు మూతబడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాజధాని నగరం చెన్నై(Chennai) సహా నాలుగు జిల్లాలోనూ సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం మరింత తీవ్ర రూపం దాల్చటంతో నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.

Chennai Rains Update

మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం నుండే చెన్నై(Chennai), తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో చల్లటి గాలులతో వాన జల్లులు ప్రారంభమయ్యాయి. సౌత్‌ చెన్నై, సెంట్రల్‌ చెన్నై, నార్త్‌ చెన్నై తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మెట్రోరైలు మార్గం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆ ప్రాంతాల్లో వర్షపునీరంతా వరదలా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోయంబేడు మెట్రో ఫ్లైఓవర్‌ దిగువ పూందమల్లి రహదారి వైపు వర్షపు నీరు వరదలా ప్రవహించడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలు, ప్యారీస్‌ కార్నర్‌ వైపు వెళ్లే వాహనాలు నత్తనడక నడిచాయి.

పురుషవాక్కం రిథడ్రన్‌ రోడ్డులో వర్షపు నీరు పొంగి ప్రవహించింది. అయనావరం నూర్‌హోటల్‌ బస్టాపు నుంచి సిగ్నల్‌ వరకు సుమారు వంద మీటర్ల వరకు అడుగుమేర వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాలన్నీ నత్తనడక నడిచాయి. అయనావరం ఈఎ్‌సఐ ఆస్పత్రి వద్ద వర్షపునీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఆ ప్రాంతం చెరువును తలపించింది. పురుషవాక్కం పాత మోక్షం థియేటర్‌ వద్ద వాననీటితో మురుగునీరు కూడా కలవటంతో దుర్వాసన వెదజల్లింది. దీంతో పాదచారులు కూడా ఆ మార్గంలో నడిచి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దాస్‌ ప్రకాష్‌ బస్‌స్టాపు వద్ద రహదారిపూర్తిగా కనిపించనంతగా వర్షపు నీరు పొంగి ప్రవహించింది. అన్నానగర్‌ అన్నా ఆర్చ్‌ వద్ద ప్రభుత్వ సిద్ధ వైద్య ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద అడుగులోతున వర్షపునీరు ప్రవహించింది.

నగరానికి వాణిజ్యకేంద్రమైన టి. నగర్‌లోనూ రహదారులన్నీ జలమయమయ్యాయి. అక్కడి రాష్ట్ర చలనచిత్ర కార్మిక సంఘం భవన ప్రాంతం, టి. నగర్‌ బస్‌స్టేషన్‌ చుట్టూ మోకాలిలోతున వర్షపు నీరు ప్రవహించింది. పెరియమేడు, వేప్పేరి, కీల్పాక్‌, ఆమ్స్‌రోడ్డు, మైలాపూరు, కోట్టూరుపురం, అన్నాసాలై, థౌజెండ్‌లైట్స్‌, ట్రిప్లికేన్‌, ఐస్‌హౌస్‌ తదితర ప్రాంతాల్లో రహదారుల్లో వర్షపునీటిలో సుమారు వందకు పైగా బైకులు, స్కూటర్లు సైలెన్సర్లలో నీరు చేరి కదలకుండా మొరాయించాయి. నగరంలోని యాభైకి పైగా ప్రధాన రహదారులలో చెరువును తలపించేవిధంగా వర్షపునీరు వరదలా ప్రవహించాయి. నగరంలో మంగళవారం వేకువజామున పెనుగాలులకు నగరంలో మూడు ప్రాంతాల్లో చెట్లు కూలిపడ్డాయి. టినగర్‌ బర్కిట్‌రోడ్డులో ఓ పెద్ద వృక్షం కూలిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెళ్ళి ఆ వృక్షాన్ని కోసి తొలగించారు. చూళైమేడు నెల్సన్‌ మాణిక్కం రోడ్డు, నుంగంబాక్కం వీరభద్రన్‌ వీధిలోనూ చెట్లు కూలిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది,, విపత్తుల నిర్వహణ బృందం, పోలీసులు అక్కడికి వెళ్ళి చెట్లను కోసి తొలగించారు.

నగరంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు సబ్‌వేలలోనూ వర్షపు నీరంతా పొంగి ప్రవహించింది. ఆ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను మళ్ళించారు. ఇక నగరంలో 20కి పైగా సబ్‌వేలలో చేరిన వర్షపునీటిని భారీ మోటార్ల ద్వారా తొలగించారు. ఇదే విధంగా తాంబరం, ఆవడి పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలన్నీ దీవుల్లా మారాయి. ఆ ప్రాంతాలలో నివసిస్తున్నవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read : EVMs : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ ఈవీఎంలపై కీలక ప్రకటన చేసిన ఈసీ

Leave A Reply

Your Email Id will not be published!