CM Chandrababu : వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల రుణాలు తెచ్చి ఏం చేశారో లెక్కలేదు
గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని....
CM Chandrababu : జిల్లా పర్యటనలో భాగంగా ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టీడీపీ(TDP)కి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని అన్నారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానని.. కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత ఎన్నికల్లో వెనకబడిన వర్గాలన్నీ కూటమికి అండగా నిలిచాయని.. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం వెల్లడించారు.
CM Chandrababu Comments
గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని.. వైసీపీ(YCP) హయాంలో తీసుకొచ్చిన రుణాలు ఏం చేశారో కూడా లెక్కలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే జాలర్ల దశదిశ మారిందన్నారు. వేట విరామ సమయంలో జాలర్లకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు. పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ‘గత నాయకుల మాదిరిగా మేము కూడా బటన్ నొక్కొచ్చు కానీ.. నేరుగా మీ దగ్గరికే వచ్చాం.. మీ సమస్యలు తెలుసుకున్నాం. మీ కష్టాలు తెలుసుకుని నేరుగా పథకాలు అందిస్తున్నాం’ అని తెలిపారు. అన్ని మత్స్యకార గ్రామాలను బాగుచేస్తామని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని.. ప్రజల ఆదాయం పెంచాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరిచాలన్నారు. గతంలో నేతలు వస్తే చెట్టు నరికేయడం.. పరదాలు కట్టడం జరిగేవని విమర్శించారు.
గతంలో ఉద్దానం ప్రాంతానికి ఎర్రన్నాయుడు నీళ్లు సాధించారని గుర్తుచేశారు. ఇప్పుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తికాబోతోందన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు రావాలన్నారు. 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని..ఏడాదిలోగా షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో ఏపీ నుంచే 29% అని చెప్పుకొచ్చారు. మత్స్యకారుల పిల్లలను బాగా చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని..అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు సాగాలని అన్నారు. ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
‘మా కంటే చిన్న వయస్సులో ఉన్నవారిలా చంద్రబాబు(CM Chandrababu) అహర్నిశలు పనిచేస్తున్నారు. వేట నిషేధ భృతి పెంచుతానని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. జీవో 217 కూడా రద్దు చేసి మత్స్యకారుల హక్కులు కాపాడారు. వెనుకబడిన జిల్లా అంటూ విని విని విని బాధపడుతూ వచ్చా .. శ్రీకాకుళం సెట్ ఇవ్వాలంటే.. మన మైండ్ సెట్ మారాలి. సుదీర్ఘ తీర ప్రాంతంలో ఒక్క పోర్ట్ లేకపోయింది. పోర్ట్‌తో పాటు ఎయిర్ పోర్ట్ కూడా నిర్మిస్తాం. కేంద్రంతో మాట్లాడి జెట్టీలు, హార్బర్లు నిర్మిస్తాం. ఏం తక్కవ మన జిల్లాకు. అన్ని వనరులు ఉన్నాయి. యువత ఉపయోగించుకోవాలి.. సహకారం అందిస్తాం’ అని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు.
కాగా.. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం అందిచనున్నారు. సముద్రంలో వేట విరామ సమయంలో ఆర్ధిక సాయం అందించనున్నారు.ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ.258 కోట్ల లబ్ధి చేకూరనుంది.
Also Read : Pahalgam Attack : స్టూడెంట్ వీసా మీద పాకిస్తాన్ కు వెళ్ళి టెర్రరిస్టుగా తిరిగివచ్చిన ఆదిల్