CM Chandrababu : లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడంపై చంద్రబాబు ఆసక్తికర రియాక్షన్
కేవలం వారసత్వంతోనే ఎవరూ రాణించలేరు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాజకీయ వారసత్వంపై తాజాగా మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కొందరు, కాబోయే సీఎం లోకేష్ అంటూ మరి కొందరు మంత్రులు సైతం మాట్లాడుతున్న సందర్భంలో లోకేష్ వారసత్వంపై చంద్రబాబు(CM Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దావోస్‌లో పలు మీడియా సంస్థలతో మాట్లాడుతున్న సందర్భంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపైనా స్పష్టతనిచ్చారు. “కేవలం వారసత్వంతోనే ఎవరూ రాణించలేరు” అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. లోకేష్‌కు తమ కుటుంబ వ్యాపారం వారసత్వంగా అందుబాటులో ఉన్నప్పటికీ, రాజకీయాలను ఆయన ప్రజా సేవ పట్ల ఆసక్తితో ఎంచుకున్నారని చెప్పారు.
CM Chandrababu Comments
ఎవరికైనా కేవలం వారసత్వం మాత్రమే అర్హత కాదన్న సీఎం “వ్యాపారం చేయడం లోకేష్‌కు చాలా సులువు. కానీ ప్రజల కోసం పనిచేయాలనే దృఢ నిశ్చయంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఏ రంగమైనా విజయాన్ని సాధించాలంటే కేవలం వారసత్వం మీద ఆధారపడటం కష్టం. అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం” అని పేర్కొన్నారు.రాజకీయ రంగంలో గౌరవప్రదంగా నిలవాలంటే, కుటుంబ అవసరాల కోసం రాజకీయాలపై ఆధారపడకూడదనే ధృఢనిశ్చయంతోనే తమ కుటుంబం 35 ఏళ్ల క్రితం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిందని చంద్రబాబు వివరించారు. “ఈ కారణంగానే గౌరవప్రదమైన రాజకీయాలు కొనసాగించగలుగుతున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
వ్యాపారం,సినిమా, రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు వంటి ఏ రంగమైనా కేవలం వారసత్వంతోనే ఎవరూ జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “అవకాశాలను వినియోగించుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారు అంటూ ఆయన యువతకు సందేశం ఇచ్చారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడంలో ప్రత్యేకంగా ముందుకు వచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. అతని కృషి, నిబద్ధత వల్లే ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read : Minister Seethakka : పీర్జాదిగూడలో మంత్రి సీతక్కకు ప్రజల నిరసనలు