CM Hemant Soren : జైలు నుంచి వచ్చి మొదటిసారి ప్రధానిని కలిసిన జార్ఖండ్ సీఎం
ఆదివారం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా సోరెన్ కలిశారు...
CM Hemant Soren : జైలు నుంచి విడుదలయ్యాక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి కలిశారు. సీఎం పదవి చేపట్టాక ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇది. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మోదీని కలవడం చర్చనీయాంశం అయింది. అయితే మోదీతో సమావేశానికి సంబంధించిన ఫొటోలను సోరెన్(CM Hemant Soren) ఎక్స్‌లో షేర్ చేస్తూ.. మర్యాదపూర్వక భేటీ అని తెలిపారు.
CM Hemant Soren Meet
ఆదివారం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా సోరెన్(CM Hemant Soren) కలిశారు. భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేయగా జూన్ 29న జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం సోరెన్ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్నికల వేళ ప్రచార నిమిత్తం బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు. బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన జార్ఖండ్ హైకోర్టు జూన్ 13న తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 29న బెయిలు మంజూరు చేస్తూ జస్టిస్ రొంగొన్ ముఖోపాధ్యాయ తీర్పు ఇచ్చారు. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.
‘‘ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఆయన ఏ నేరానికీ పాల్పడలేదు. బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవు. అందుకే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలైన పక్షం రోజుల్లోనే ఆయన ప్రధాని మోదీని కలవడం చర్చలకు దారి తీసింది. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌కి రెండు నెలల ముందే అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. హరియాణా, మహారాష్ట్రకు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఓటరు జాబితా నవీకరణ, సవరణ ప్రక్రియ ఒకే షెడ్యూల్‌లో కొనసాగుతుండగా, జార్ఖండ్‌లో కూడా అదే షెడ్యూల్‌ను అనుసరిస్తున్నారు.
ఇప్పటికే భారత ఎన్నికల సంఘం బృందం జులై 10, 11 తేదీల్లో జార్ఖండ్‌లో పర్యటించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రవి కుమార్.. 24 జిల్లాల ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా రివిజన్, పోలింగ్ స్టేషన్ల సన్నాహాలపై సమీక్ష నిర్వహించారు.
Also Read : Deepinder Goyal : బిలియనీర్ల జాబితాలో జొమాటో వ్యవస్థాపకుడు