CM MK Stalin : ద్రావిడ పాలనను విమర్శించే వాళ్ల పై భగ్గుమన్న సీఎం స్టాలిన్
పెరియార్ స్మారక స్థలానికి వస్తే పుట్టినింటికి వచ్చినంత ఆనందం కలుగుతుందన్నారు...
CM MK Stalin : రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(CM MK Stalin) వ్యాఖ్యానించారు. పెరియార్ 51వ వర్థంతి సందర్భంగా వేప్పేరిలోని పెరియార్ థిడల్‌లో ద్రావిడ కళగం ఆధ్వర్యంలో నిర్మించిన పెరియార్ గ్రంథాలయ పరిశోధన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ద్రావిడ కళగం నేత కె.వీరమణి ముఖ్యమంత్రికి పెరియార్ ఉపయోగించిన ఊతకర్రను బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ. తన జీవితంలో ఇప్పటి వరకు వివిధ ప్రముఖులు, సంస్థలు, సభల నుంచి అందుకున్న కానుకల కంటే పెరియార్ ఊతకర్ర అత్యంత విలువైన, పది కాలాలపాటు దాచుకోవాల్సిన అరుదైన కానుకగా భావిస్తున్నానన్నారు. పెరియార్ స్మారక స్థలానికి వస్తే పుట్టినింటికి వచ్చినంత ఆనందం కలుగుతుందన్నారు.
CM MK Stalin Comments
పెరియార్ కాలధర్మం చేసి ఐదు దశాబ్దాలు దాటినా, రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. పెరియార్ ఆశయాలను మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి ఆచరించారని, తాను కూడా ఆ మహాపురుషుల అడుగుజాడలలోనే నడుస్తున్నానని స్టాలిన్(CM MK Stalin) పేర్కొన్నారు. ఇటీవల కేరళలోని వైక్కమ్ వద్ద కొత్త మెరుగులు దిద్దుకున్న పెరియర్ స్మారక మండపాన్ని తాను ప్రారంభించినప్పుడు తనతోపాటు వచ్చిన వీరమణి పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుతం 90వ వడిలో ఉంటూ పెరియార్ ఆశయాలు, సిద్ధాంతాలపై విస్తృత ప్రచారోద్యమం సాగిస్తున్న వీరమణి నిండునూరేళ్లు వర్థిల్లాలని స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్, పీకే శేఖర్‌బాబు, కయల్‌విళి సెల్వరాజ్, ఎంపీ రాజా, మేయర్ ఆర్.ప్రియ, ఎమ్మెల్యేలు తాయగం కవి, ఎ.వెట్రిఅళగన్, జోసెఫ్ సామువేల్, ద్రావిడ కళగం ఉపాధ్యక్షుడు కలి పూంగుండ్రన్, ప్రధాన కార్యదర్శి వి. అన్బురాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Rains Update : బంగాళాఖాతంలో ఆయా రాష్ట్రాల మీదుగా మల్లి అల్పపీడనం