CM MK Stalin : టంగ్‌స్టన్ ప్రాజెక్ట్ అమలైతే తన పదవికి రాజీనామా చేస్తానంటున్న స్టాలిన్
సమస్య తీవ్రరూపం దాల్చిన తర్వాతే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారని, ఇది ప్రజల ప్రధాన సమస్య అని పేర్కొన్నారు...
CM MK Stalin : మదురై జిల్లా మేలూరు సమీపంలో టంగ్‌స్టన్ ప్రాజెక్టు అమలైతే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోనని ముఖ్యమంత్రి స్టాలిన్(CM MK Stalin) ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం అనుమతివ్వడాన్ని ఖండిస్తూ సోమవారం అసెంబ్లీలో నీటివనరులశాఖ మంత్రి దురైమురుగన్ ఓ ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ సందర్భంగా అన్ని పార్టీల సభ్యులు ఆ ప్రాజెక్టును అనుమతించకూడదని డిమాండ్ చేశారు.
CM MK Stalin Comment
ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ పది నెలల క్రితమే టంగ్‌స్టన్ సొరంగం తవ్వకాలకు వేలంపాట జరిగినా డీఎంకే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించిందని ఆరోపించారు. సమస్య తీవ్రరూపం దాల్చిన తర్వాతే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారని, ఇది ప్రజల ప్రధాన సమస్య అని పేర్కొన్నారు. టంగ్‌స్టన్ తవ్వకాలకు వేలం జరిగిన పది నెలల పాటు పాలకపక్షం ఎందుకు కాలయాపన చేసిందో స్పష్టం చేయాలని ఈపీఎస్ పట్టుబట్టారు. రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి అన్నదాతలకు తీరని నష్టాన్ని కలిగించే టంగ్‌స్టన్ ప్రాజెక్టును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన ప్రత్యేక తీర్మానాన్ని అన్నాడీఎంకే సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తారని ప్రకటించారు.
టంగ్‌స్టన్ సొరంగం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. పార్లమెంట్‌లో డీఎంకే ఎంపీలు ఆ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఈపీఎస్కు తెలియకపోవటం శోచనీయమన్నారు.. తాను కూడా కేంద్రానికి లేఖ రాశానని వివరించారు. పార్లమెంట్‌లో డీఎంకే ఎంపీలు సభను స్తంభింపజేసేలా పలు మార్లు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడైనప్పుడే తమ పార్టీసభ్యులంతా తీవ్ర వ్యతిరేకతను సభాముఖంగా ప్రకటించారన్నారు. టంగ్‌స్టన్ పథకాన్ని అడ్డుకుని తీరుతామని, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. తాను సీఎంగా ఉన్నంత వరకూ టంగ్‌స్టన్ ప్రాజెక్టు అనుమతించే ప్రసక్తే లేదని స్టాలిన్(CM MK Stalin) ఉద్వేగంగా పేర్కొన్నారు. టంగ్‌స్టన్ ప్రాజెక్టు వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
Also Read : MLA KTR : రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం