CM Revanth Reddy : సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదు...

CM Revanth Reddy : సీతారామ ప్రాజెక్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీశ్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. తొలి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్‌ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని.. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్(CM Revanth Reddy) ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు.

CM Revanth Reddy…

“ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు నిధుల కోసం ఒత్తిడి చేస్తే నేను మిగతా జిల్లాల గురించి కూడా ఆలోచిస్తున్నా. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నిధుల కేటాయింపులో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్, హరీష్ బోగస్ మాటలు చెబుతారు గనుక ఆ పార్టీ నేతలు నీళ్ళ కోసం ఆందోళన చేయలేదు. నాగార్జున సాగర్ నీళ్ళు రాకపోయినా గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు కోసం వైరా లింక్ కెనాల్ చేపట్టాం. లింక్ కెనాల్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటపడి చేపించాం.

పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదు. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదు. మంత్రి తుమ్మలపై నమ్మకంతో నష్ట పరిహారం ఇవ్వక పోయినా లింక్ కెనాల్‌కు రైతులు భూములు ఇచ్చారు. హరీష్ రావు దూలంలాగా పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు. రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. కమీషన్ల కోసం పంప్ మోటార్లు పెట్టారు. నాలుగేళ్లుగా పంప్ హౌస్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు.

ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పంప్ హౌస్‌లో నీరు పారేలా చేశాం. కృష్ణా జలాలు రాక పోయినా ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు అందే అవకాశం ఉంది. పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో నీటి పంచాయితీ లేకుండా గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు నీరు అందిస్తాం. హరీశ్ అభినందించక పోయినా ఫర్వాలేదు కానీ అవమానించేలా మాట్లాడొద్దు. రానున్న రోజుల్లో 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను మొదటి దశ ప్రాధాన్యంగా పూర్తి చేస్తాం” అని రేవంత్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు త్వరగా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు.

Also Read : Speaker Ayyannapatrudu : వైసీపీ అధికారంలో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి

Leave A Reply

Your Email Id will not be published!