CM Revanth Reddy: మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి !

మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి !

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి… రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్ ను కలిసిన రేవంత్… తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డాను కలిసారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో వైద్యసేవలను మెరుగుపరిచేందుకు, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు.

CM Revanth Reddy Meet

ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం నిబంధనలన్నింటినీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 5,519 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఎం పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.323.73 కోట్లు, 2024-25లో మొదటి త్రైమాసికానికి సంబంధించి రూ.138 కోట్లు, 2023-24లో రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన రూ.231.40 కోట్లు కలిపి మొత్తం రూ.693.13 కోట్లు రావాల్సి ఉన్నట్లు కేంద్రమంత్రికి విన్నవించారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైనా అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బంది ఇబ్బందులు పడకుండా 2023 అక్టోబరు నుంచి రాష్ట్ర వాటాతోపాటు కేంద్ర వాటానూ తామే విడుదల చేస్తూ వస్తున్నామని జేపీ నడ్డా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి ఉన్నారు.

తెలంగాణ ఎంపీలు, రాహుల్‌గాంధీ ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. 18వ లోక్‌సభ సభ్యులుగా వారి ప్రమాణాన్ని ఆయన లోక్‌సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా చూశారు. ఆయనతోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాజీ మంత్రి జానారెడ్డి ఉన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి(CM revanth Reddy) ఈ కార్యక్రమానికి హాజరైన సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీలను కలిశారు. సోనియాగాంధీతో కొంతసేపు మాట్లాడారు. ఎంపీల ప్రమాణానికి హాజరైన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనం ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ రఘువీర్, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు రాజీవ్‌శుక్లా, బలరాంనాయక్‌ లు ఫోటోలు దిగి సందడిచేసారు.

Also Read : Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక !

Leave A Reply

Your Email Id will not be published!