CM Revanth Reddy :డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణా అసెంబ్లీ తీర్మానం
డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణా అసెంబ్లీ తీర్మానం
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న డీలిమిటేషన్(Delimitation) ను వ్యతిరేకిస్తూ తెలంగాణా అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్షం భేటీకు పార్టీలకు అతీతంగా… అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యారు. తాజాగా తెలంగాణా అసెంబ్లీలో డీలిమిటేషన్(Delimitation) ను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ… ‘‘దేశంలో 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలను నియంత్రించడానికి పునర్విభజనను వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలపై దాడి చేస్తోంది. ఇదే జరిగితే భవిష్యత్తులో మనతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
CM Revanth Reddy – జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు
‘‘రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా పునర్విభజనపై కేంద్రం చేస్తున్న కసరత్తు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం ఆదేశాలను పాటించి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు కేవలం జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. ఎంపీ స్థానాలను యథాతథంగా ఉంచాలి. సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెంచాలి. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను తక్షణమే 153కు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తోంది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతోంది.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని, సుహృద్భావం దెబ్బతింటుందని భావించి 1975 సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 25 ఏళ్లపాటు వాయిదా వేశారు. 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ కూడా రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరగవద్దని భావించి పునర్విభజనను వాయిదా వేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక పునర్విభజనపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన సమావేశంలో కేంద్రం నిర్ణయం నష్టం కలిగిస్తే దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించాం. పునర్విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ ఆలోచనే లేదని కొందరు కేంద్ర మంత్రులు చెబుతున్నారు. వారు చెప్పేది అర్ధ సత్యాలే. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల నియంత్రణకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అదే జరిగితే బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయి. దక్షిణాదిలో జనాభా నియంత్రణ వల్ల స్థిరీకరణ జరిగింది. జనాభా వృద్ధి రేటు 1.8 శాతమే ఉంది. ప్రస్తుతం 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో దక్షిణాది వాటా 24% ఉండగా… పునర్విభజనతో 19 శాతానికి పడిపోయే అవకాశం ఉంది.
త్వరలోనే పార్టీలు, సంఘాలతో సమావేశం
దక్షిణాది రాష్ట్రాలపై దాడి జరుగుతోందని అర్థమవుతోంది. కేంద్రంతో మాట్లాడదాం. అంగీకరిస్తే సరి. లేకుంటే పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి సీఎంలకు విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలో పునర్విభజనపై జానారెడ్డి, భట్టివిక్రమార్క, కేశవరావుల నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. భవిష్యత్తులో జరగబోయే నష్టాలపై చర్చిద్దాం. రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దాం. సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అందరూ మద్దతు పలకాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. అనంతరం.. పునర్విభజన (డీలిమిటేషన్)కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
Also Read : Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ కీలక అప్‌డేట్