CM Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
CM Revanth Reddy : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ‘డీలిమిటేషన్’పై అఖిలపక్ష భేటీ నిర్వహించారు. చెన్నై వేదికగా ఏర్పాటుచేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగవంత్ మాన్, పినరయి విజయన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
CM Revanth Reddy – KTR in one Meeting
అయితే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్(KTR) ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ తీరును రేవంత్ రెడ్డి… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, పథకాలను కేటీఆర్ విమర్శించుకుంటూనే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు తిన్నారని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంటే… మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రాజెక్టు చేపట్టారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు చేసిందని… రైతు బంధు, రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి చెప్తుంటే… సగానికి పైగా లబ్ధిదారులకు కాంగ్రెస్ ఇచ్చే పథకాలు అందడం లేదని కేటీఆర్ మండిపడుతుంటారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని అధికార పార్టీ నేతలు అంటుంటే… రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే అంశంపై ఏకాభిప్రాయానికి రావడం ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. వారిద్దరూ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా… రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అంతా ఒక్కటిగా చేతులు కలపడం శుభపరిణామమని విశ్లేషకులు అంటున్నారు. అందుకు తెలంగాణ ఉద్యమమే ఉదాహరణ అంటున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అంతా కలిసి రోడ్లపైకి వచ్చి మరీ తెలంగాణ సాధించుకున్నారని.. ఇప్పుడు డీలిమిటేషన్ అంశంలోనూ అదే స్ఫూర్తి కనిపిస్తోందంటూ చెప్తున్నారు.
కాగా, స్టాలిన్ నేడు ప్రతిపాదించే జేఏసీలో కాంగ్రెస్ తోపాటు బీఆర్‌ఎస్ కూడా భాగస్వామిగా మారితే, ఈ అంశంపై ఇరు పార్టీలూ కలిసి పోరాట కార్యాచరణలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్… లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం కలిసి పోరాటం చేయాల్సి వస్తుంది.
Also Read : MLA Raja Singh: బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు