Tejashwi Yadav: ఓటరు కార్డుల వివాదంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పై పోలీసులకు ఫిర్యాదు

ఓటరు కార్డుల వివాదంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పై పోలీసులకు ఫిర్యాదు

Tejashwi Yadav : ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) పై పట్నాలోని దిఘా పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు నమోదైంది. ఆయనకు రెండు ఓటర్‌ ఐడీ కార్డులు ఉన్నాయంటూ న్యాయవాది రాజీవ్‌ రంజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు.

Tejashwi Yadav Case Filed

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉండగా ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR)పై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగించిన ఈసీ ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) గత శనివారంనాడు మీడియా సమావేశంలో తన ఓటర్ ఐడీని చూపిస్తూ తన పేరు ఓటర్ల జాబితాలో లేదని చెప్పారు. తన పేరు సరికొత్త ఓటర్ల జాబితా నుంచి మాయమైందని ఆరోపించారు. దీనితో ఒక్కసారిగా అప్రమత్తమైన ఎన్నికల అధికారులు జాబితాలను తెప్పించుకొని వెతికారు. బిహార్‌ యానిమల్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం లైబ్రరీ బిల్డింగ్‌లోని పోలింగ్‌ బూత్‌ 204లో దానిని గుర్తించారు. జాబితాలో 416 నెంబర్‌లో తేజస్వీ వివరాలున్నాయని పేర్కొన్నారు. ఆయన ఎపిక్‌ నెంబర్‌ను RAB0456228గా పేర్కొన్నారు. కానీ, మాత్రం తన ఎపిక్‌ నెంబర్‌ RAB2916120గా వెల్లడించారు. అధికారులు మాత్రం ఆ సంఖ్యతో తాము ఆయనకు ఎపిక్‌ నెంబర్‌జారీ చేయలేదని పేర్కొన్నారు. దానిని తమకు అప్పగిస్తే.. దర్యాప్తు చేస్తామని చెప్పారు.

వాస్తవానికి అంతకు ముందు తేజస్వీ ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ అసలు తన పేరే ఓటర్‌ జాబితాలో లేదని సంచలన ప్రకటన చేశారు. బిహార్‌లో ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసిన రోజే ఎన్నికల కమిషన్‌ భాజపా కోసం ఓట్లను చోరీ చేసిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తేజస్వీ ప్రకటన రావడం గమనార్హం. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ రాహుల్‌, తేజస్వీ అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్‌ ఇంటెన్షివ్‌ రివిజన్‌(SIR)పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రెండు ఎపిక్‌లు కలిగి ఉండటం క్రిమినల్ నేరమని బీజేపీ తప్పుపట్టడంతో ఈసీ స్పందించింది. తేజస్వి మీడియా సమావేశంలో చూపించిన ఎపిక్‌ వివరాలను తమకు అందజేయాలని తేజస్వికి ఇచ్చిన నోటీసులో ఈసీ కోరింది. వివరాలు అందజేస్తే దానిపై దర్యాప్తు జరుపుతామని తెలిపింది.

Also Read : PM Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోదీ, అమిత్‌ షా వరుస భేటీలు

Leave A Reply

Your Email Id will not be published!