Pinnelli Rama Krishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు షరతులు !

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు షరతులు !

Pinnelli Rama Krishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో బెయిల్ పై ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు పలు కీలక షరతులు విధించింది. మాచర్ల నియోజకవర్గంలోకి అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. పాల్వాయిగేటు గ్రామంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూనే ఈ షరతులు విధిస్తూ.. న్యాయస్థానం గురువారం జారీచేసిన ఉత్తర్వుల ప్రతి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

Pinnelli Rama Krishna Reddy…

‘‘జూన్‌ 6 వరకు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం నరసరావుపేటలోనే ఉండాలి. ఒకవేళ ఓట్ల లెక్కింపు కేంద్రం మరోచోట ఉంటే… లెక్కింపు రోజు మాత్రమే అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ కేసులో పాత్ర గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లాడకూడదు. సాక్షులను కలవడానికి వీల్లేదు. వారిని ప్రభావితం, భయపెట్టడం చేయొద్దు. అనుచరుల చర్యలకు పిన్నెల్లిదే బాధ్యత. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి(Pinnelli Rama Krishna Reddy)దే. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం సృష్టించొద్దు. నేరపూర్వక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు, నేర ఘటనలను పునరావృతం చేయొద్దు’’ అని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా పిన్నెల్లి కదలికలపై పోలీసు అధికారులతో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీచేయాలని సీఈఓను ఆదేశించింది.

ఈ షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు స్వేచ్ఛనిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రధాన బెయిల్‌ పిటిషన్‌ లో కౌంటర్‌ వేసేందుకు కూడా పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది. తదుపరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. మరోవైపు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలోనూ న్యాయస్థానం ఇదే తరహా షరతులు విధించింది.

Also Read : Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల రద్ధీ ! వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు !

Leave A Reply

Your Email Id will not be published!