CP CV Anand : ఇంటి పనిమనుషుల పూర్తి వివరాలు యజమానులు కచ్చితంగా తెలుసుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. యజమానులు కోరితే పనివారి గురించి పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేసి పోలీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) అన్నారు. ప్రజల భద్రత తమకు ప్రథమ ప్రాధాన్యమని, ఎంత కష్టమైనా పనివాళ్లకు సంబంధించి పూర్తిగా విచారించి నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీపీ సూచించారు.
CP CV Anand Comment
హిమాయత్‌నగర్ పోలీస్ స్టేన్ పరిధిలో 2024 జనవరిలో స్నేహలత (63)ను హతమార్చి దోపిడీ చేసిన ముఠాలోని ఓ సభ్యుడు అదే పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పనికి చేరి భారీ చోరీ చేశాడు. నిందితుడికి ఆశ్రయమిచ్చామన్న విషయం యజమానికి తెలియదని సీపీ(CP CV Anand) అన్నారు. పనివాళ్లను నియమించుకునే సమయంలో వెరిఫికేషన్ కోసం పోలీసులను సంప్రదిస్తే నిందితుడిని గుర్తించే అవకాశముండేదన్నారు.
చోరీకేసుల్లో ఎక్కువ శాతం ఇళ్లలో పనిచేసేవారు నిందితులుగా ఉంటున్నారని, ఇదే తరహాలో పలు కేసులు నమోదయ్యాయన్నారు. నేపాల్ సరిహద్దులోని బిహార్ రాష్ట్రం ముధుబని జిల్లా బీరుల్ గ్రామానికి చెందిన వారు చోరీలు చేయడంలో సిద్ధహస్తులని తెలిపారు. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లలో పనివారిగా చేరి యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తూ, వారు ఇంట్లో నగలు, డబ్బులు ఎక్కడ దాచిపెడుతున్నారో గుర్తిస్తారు. ఇంట్లో యజమానులు లేని సమయంలో పథకం ప్రకారం దోచేస్తారని పేర్కొన్నారు.
దోపిడీ చేస్తున్న సమయంలో ఎవరైనా అడ్డువస్తే ముఠాలోని సభ్యులు వారిని చంపేందుకు కూడా వెనుకాడరని సీపీ తెలిపారు. దోపిడీ చేసిన ముఠా సభ్యులు, స్వస్థలాలకు వెళ్లకుండా కేసు సద్దుమణిగేవరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటారని, వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారిందన్నారు. పనివాళ్లు చోరీ చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్న సమయంలో.. యజమానులు ఇంట్లో నియమించుకునే పనివారి గురించి తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పనివారి గురించిన వివరాలు ఇస్తే, దేశ వ్యాప్తంగా ఉన్న డాటాను జల్లెడ పట్టి రిపోర్ట్ అందజేస్తామన్నారు.
Also Read : నేడు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించనున్న సీఎం