Delhi CM Rekha Gupta : ప్రజల నాడిని గ్రహించిన పార్టీలు విజయభేరి మోగిస్తాయి

2014లో ప్రారంభమైన ఈ నూతన శకం, దేశంలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది...

Rekha Gupta : భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఓ పాఠాన్ని అందిస్తుంది. ప్రజల నాడిని గ్రహించిన పార్టీలు విజయభేరి మోగిస్తాయి. గత దశాబ్ద కాలంగా దేశంలో జరిగిన ఎన్నికల ధోరణులను పరిశీలిస్తే, బీజేపీ(BJP) విజయాన్ని సాధించడం లేదా ప్రధాన ప్రత్యర్థిగా ఉండటం కనిపిస్తోంది.

Delhi CM Rekha Gupta Comments

ఇందుకు ప్రధాన కారణం బీజేపీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నిబద్ధత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని అభివృద్ధి దృక్పథం.

27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ(BJP) దేశ రాజధానిలో విజయ బావుటా ఎగురవేసింది. 2014లో ప్రారంభమైన ఈ నూతన శకం, దేశంలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ప్రజలు ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ (కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయడం) ద్వారానే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారు.

హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ విజయాలు, అలాగే స్థానిక ఎన్నికల్లో సాధించిన మెజారిటీ, ప్రభుత్వ పాలనా విధానంపై ప్రజలు చూపిస్తున్న విశ్వాసానికి నిదర్శనం. బీజేపీ నాయకత్వం పారదర్శక అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతుల్యంగా అమలు చేయడంలో ముందంజలో ఉంది.

ఢిల్లీని చాలా సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ, గత కొన్ని ఎన్నికల నుంచి ప్రజల మద్దతు కోల్పోతూ వచ్చింది. దీనికి తోడు I.N.D.I.A కూటమిలోనూ భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కూటమి సభ్యులు ‘స్నేహం చేసి చెడిపోయాం’ అన్న భావనకు లోనవుతూ, తమ భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు భారత రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకురావడానికి సంకల్పించిన నాయకుడిగా పేరు పొందారు. అవినీతి వ్యతిరేక పోరాటంతో ఆయన రాజకీయాల్లో ప్రవేశించి, ప్రజలకు కొత్త రాజకీయ శైలిని అందిస్తానని వాగ్దానం చేశారు.

మొదట్లో ఇది ప్రజలను ఆకర్షించినా, కాలక్రమంలో ఆయన పాలనా విధానాలు, నిర్ణయాలు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. ఢిల్లీ మాదిరిగా పంజాబ్‌లో కూడా తన పార్టీని అధికారంలోకి తెచ్చినా, అక్కడ కూడా సమస్యలు ఉధృతమయ్యాయి. పాలనానుభవం లేకపోవడం వల్ల ఆయన ప్రభుత్వం కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధిలో పూర్తిగా విఫలమైంది.

అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్(Arvind Kejriwal) రాజకీయ జీవితానికి మరిన్ని ఇబ్బందుల్ని కలిగించాయి. ముఖ్యంగా, ఢిల్లీలో మద్యం విధానంలో జరిగిన అక్రమాలు పెద్ద రాజకీయ కలకలం రేపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొందరు లైసెన్స్ లబ్ధిదారులకు అనుకూలంగా మారాయని, ప్రజాధనం దుర్వినియోగానికి గురైందని ఆరోపణలు వచ్చాయి.

దీనిపై కేంద్ర సంస్థలు విచారణ జరుపుతుండగా, కేజ్రీవాల్ ప్రభుత్వం దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా మలిచే ప్రయత్నం చేసింది. కానీ, ప్రజలు మాత్రం ఆయనను నైతికంగా ప్రభుత్వాన్ని నడిపించగలిగే నాయకుడిగా చూడలేకపోయారు. ప్రస్తుతం కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఒకప్పుడు బీజేపీకు ప్రత్యామ్నాయంగా ఆప్‌ను చూసినవారు, నేడు ఆ పార్టీని అదే బీజేపీతో పోల్చి చూడడం ప్రారంభించారు. పాలనా వైఫల్యాలు, సంక్షేమ హామీల ఆర్థిక అనిశ్చితి, అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్ నాయకత్వాన్ని మరింత దెబ్బతీశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీలో కేజ్రీవాల్ వంటి ముఖ్యమంత్రులు సంక్షేమ పథకాలను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుని ప్రజలను మోసగించాలని చూశారు.

బీజేపీ తన నాయకత్వాన్ని సిద్ధాంతం, నిబద్ధత, ప్రజాసేవ అనే మూడు మూలస్తంభాలపై నిర్మిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ తీసుకున్న సుస్థిర నిర్ణయాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలు రాజకీయ విశ్లేషకులకు అనేక పాఠాలను నేర్పించాయి. గతంలో కొన్ని ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా, ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణం, పార్టీ వ్యవస్థాగత శక్తి, మోదీ నేతృత్వంలోని విశ్వసనీయత వంటి అంశాలు గెలుపునకు దోహదపడ్డాయి.

బీజేపీ విజయానికి మొదటినుంచి ప్రధాన కారణం నరేంద్ర మోదీ నాయకత్వం. ఆయన నాయకత్వంలో పార్టీకి ఉన్న భరోసా ప్రజల్లో మరింత బలపడింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, పారదర్శక పాలన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ఢిల్లీ ప్రజలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని చూసి తమ రాష్ట్రంలో కూడా అదే తరహా పాలనను కోరుకున్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన మరో అంశం సమర్థమైన ఎన్నికల వ్యూహం. ప్రజల్లోకి వెళ్లి నేరుగా వారి సమస్యలు తెలుసుకోవడం, నమ్మకాన్ని పెంచే విధంగా మేనిఫెస్టోను రూపొందించడం వంటివి దోహదపడ్డాయి.

రేఖా గుప్తా(Rekha Gupta) ఢిల్లీ రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాజధాని పాలనలో కొత్త శకాన్ని ప్రారంభించారు. ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, సమర్థ నాయకత్వం, ప్రజాసేవ, పార్టీ పట్ల నిబద్ధత ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగారు.

కొత్త ప్రభుత్వంపై ఢిల్లీ ప్రజల్లో అంచనాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో రేఖా గుప్తా(Rekha Gupta) నాయకత్వంలో ఢిల్లీ అభివృద్ధి ఎంతగా ఊపందుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.

Also Read : YS Sharmila Slams : కూటమి సర్కార్ లో కాలయాపన తప్ప అభివృద్ధి లేదు

Leave A Reply

Your Email Id will not be published!