Delhi Ex CM Atishi : ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వాన్ని నడిపించే సత్తా లేని నేతలు ప్రజల అభివృద్ధికి ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు...
Atishi : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి పది రోజులైనా ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని ప్రకటించే విషయంలో జరుగుతున్న జాప్యంపై మాజీ ముఖ్యమంత్రి అతిషి(Atishi) విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని నడపగలిగే నాయకుడెవరూ బీజేపీలో లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆమె మాట్లాడుతూ, దేశ రాజధానిని పాలించగలిగే విశ్వసనీయుడైన నాయకుడు వారికి (బీజేపీ) లేరని అన్నారు.
Delhi Ex CM Atishi Shocking Comments
”ఎన్నికల ఫలితాలు ప్రకటించి పది రోజులైంది. ఫిబ్రవరి 9వ తేదీనే బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి తక్షణమే అభివృద్ధి పనులు ప్రారంభిస్తుందని ప్రజలు అనుకున్నారు. అయితే ఆ పార్టీలో ఢిల్లీని సమర్ధవంతంగా పాలించగలిగే నేత లేడని ఇప్పుడు అర్ధమైంది” అని అతిషి అన్నారు. బీజేపీ నుంచి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమ్మకం లేదని, ఆ పార్టీకి ఒక విజన్ కానీ, ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యూహం కానీ లేవని అతిషి విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపించే సత్తా లేని నేతలు ప్రజల అభివృద్ధికి ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో ఈనెల 19న శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేత ఎంపిక జరుగుతుంది. 20న ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.
Also Read : క్రికెటర్ చాహల్, ధనశ్రీ మధ్య వివాదం భరణం వరకు వచ్చిందా.?