Dhruv Jurel : మరోసారి ఆసీస్ ఆటగాళ్లపై తన సత్తా చాటిన ‘ధృవ్ జురెల్’

ఆసీస్ఏతో మ్యాచ్‌లో భారత్‌కు సరైన స్టార్ట్ దొరకలేదు...

Dhruv Jurel : న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా.. తదుపరి జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ బాగానే ఉన్నా బ్యాటింగ్ విభాగంలోని లోపాలు టీమ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో జట్టుకో గుడ్ న్యూస్. యంగ్ బ్యాటర్ ధృవ్ జురెల్(Dhruv Jurel) సూపర్బ్ ఇన్నింగ్స్‌తో ఫామ్‌ను అందుకున్నాడు. ఆసీస్ సిరీస్ కోసం కాస్త ముందుగానే కంగారూ గడ్డకు చేరుకున్న యువ ఆటగాడు.. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా ఏ-భారత్ ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జురెల్(Dhruv Jurel) జూలు విదిల్చాడు.

Dhruv Jurel Game..

ఆసీస్ఏతో మ్యాచ్‌లో భారత్‌కు సరైన స్టార్ట్ దొరకలేదు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (0), కేఎల్ రాహుల్ (4) సహా టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. సాయి సుదర్శన్ (0), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (4) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జురెల్ సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్మీ హవల్దార్ కొడుకైన ఈ యంగ్ బ్యాటర్ తండ్రి స్ఫూర్తితో ఫైటింగ్ నాక్ ఆడాడు. సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్‌తో కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. మరో యంగ్‌స్టర్ దేవ‌దత్ పడిక్కల్ (26)తో కలసి ఒక్కో పరుగును స్కోరు బోర్డు మీదకు చేరుస్తూ పోయాడు.

పడిక్కల్ఔట్ అయినా జురెల్ మాత్రం ఆఖరి వరకు క్రీజులో నిలబడ్డాడు. తొమ్మిదో వికెట్‌గా అతడు వెనుదిరిగాడు. మొత్తంగా 186 బంతులు ఎదుర్కొన్న ఈ టాలెంటెడ్ బ్యాటర్.. 6 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 80 పరుగులు చేశాడు. వికెట్లు పడుతుండటంతో బిగ్ షాట్స్ కంటే డిఫెన్స్, స్ట్రైక్ రొటేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు జురెల్. ఒక ఎండ్‌ను కాపాడుతూనే స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అందుకే అతడి కెరీర్‌లో ఇదో స్పెషల్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న టీమిండియాకు ఆసీస్ సిరీస్‌లో జురెల్ ట్రంప్ కార్డ్‌గా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి బ్యాటింగ్‌ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. కంగారూలకు పోయించావని.. ఇలాగే ఆడాలని ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆసీస్ ఇప్పుడు 2 వికెట్లకు 53 పరుగులతో ఉంది.

Also Read : MLA Vasantha Krishna : మాజీ మంత్రి జోగి రమేష్ కి ఘాటు వార్నింగ్ ఇచ్చిన మైలవరం ఎమ్మెల్యే

Leave A Reply

Your Email Id will not be published!