India-Canada : భారత్, కెనడా మధ్య రోజు రోజుకు ముదురుతున్న దౌత్య యుద్ధం
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భారత్‌పై ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తింది...
India-Canada : భారతదేశం, కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఆ దేశ దుష్ట చేష్టలకు భారత్ ఘాటుగా బదులిస్తోంది. కెనడా డిప్యూటీ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారతదేశం(India) విడిచి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 19 అర్ధరాత్రి 12 గంటలలోపు వెళ్లిపోవాలని హుకుం జారీ చేసింది. మరోవైపు నిన్న(సోమవారం) సాయంత్రం కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు పంపింది. ఖలిస్తానీ ఉగ్రవాది, కెనడా(Canada) పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందంటూ చేసిన ఆరోపణలు మోదీ సర్కార్ ఖండించింది. తమ దౌత్యవేత్తలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భారత్(India)ను దోషిగా నిలబెట్టేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్రం నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను వెనక్కి పిలవగా.. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కెనడా తీరుపై భారత్ మండిపడుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భారత్‌పై ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. భారత కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై చేస్తు్న్న నిరాధార ఆరోపణలు తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఎంఈఏ ప్రకటన విడుదల చేసింది.
India-Canada Issues..
పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా పలువురు ఖలిస్థానీ వేర్పాటు వాదులు ఏళ్లుగా నిరసనలు చేస్తున్నారు. దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో వారిని ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ అగ్రనేత, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యారు. అప్పట్నుంచి అతని హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ ట్రూడో ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా కేసు విచారణలో భాగంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితుల చేర్చింది. దీన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది.
దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం రెలరేగింది. కెనడా ఆరోపణలను భారత్ తిప్పికొడుతోంది. ఖలిస్థానీలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని కెనడా జర్నలిస్టు బార్డ్‌మన్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఆ శక్తులు పూర్తిగా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కెనడా పౌరులు ట్రూడో ప్రభుత్వంతో విసిగిపోయారని, ఆయన్ను న్యాయ, చట్ట సంస్థలు, మీడియా నమ్మడం లేదని అన్నారు. చాలామంది కెనడా ప్రజలు భారత్‌కే మద్దతు ఇస్తున్నారని బార్డ్‌మన్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది కెనడా నూతన ప్రభుత్వం వచ్చే వరకూ రెండు దేశాల దౌత్య సంబంధాలు మరింత దిగజారకూడదని ఆయన కోరారు.
Also Read : Impact Player Rule : దేశీ టోర్నీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన లను తొలగించిన బీసీసీఐ