DK Shiva Kumar Comment : ‘టార్చ్ బేర‌ర్’ ఫోక‌స్ ఫ‌లిస్తుందా

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి వ‌స్తుందా

DK Shiva Kumar Comment : ప్లాన్ రూపొందించ‌డం లోనే కాదు దానిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డంలో త‌న‌కు త‌నే సాటి అని నిరూపించుకున్నారు క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఇప్పుడు దేశంలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఆయ‌న‌దే కావ‌డం ఒక ర‌కంగా ఇత‌ర పార్టీల‌ను, స్వ‌పక్షంలోని నేత‌ల‌ను విస్తు పోయేలా చేస్తోంది. పాలిటిక్స్ లో రాణించాలంటే ఆర్థిక‌, అంగ బ‌లం ఉండాలి. అంత‌కంటే ప్ర‌త్య‌ర్థుల‌ను అంచ‌నా వేయ‌డం, వారిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం, జ‌నంలో ఉండ‌డం, అన్నింటినీ ఎదుర్కొనే స‌త్తా క‌లిగి ఉండ‌డం. ఇవ‌న్నీ డీకే శివ‌కుమార్(DK Shiva Kumar) కు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. ఎవ‌రికి వారే య‌మునా తీరే అనే రీతిలో నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వారంద‌రినీ క‌లుపుకుని పోయేలా చేయ‌డం, పార్టీని గాడిలో పెట్ట‌డం వెన్న‌తో పెట్టిన విద్య డీకేకు. దీంతో మ‌నోడికి ఎన‌లేని కమాండ్ ఏర్ప‌డింది హైక‌మాండ్ వ‌ద్ద‌.

దేశంలో ఆక్టోప‌స్ లా విస్త‌రించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌ల్ని త‌న అద్భుత‌మైన రాజ‌కీయ చాణ‌క్యంతో బురిడీ కొట్టించాడు డీకే. తాజాగా క‌న్న‌డ నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో కీల‌క భూమిక పోషించాడు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar). పూర్తిగా పాజిటివ్ ఓటు బ్యాంకును ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంలో, ఎక్కువ హామీలు ఇవ్వ‌కుండా, ప్ర‌జ‌ల‌కు ఏది అవ‌స‌ర‌మో గుర్తించేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన‌లేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్ర‌స్తుతం ఆ పార్టీలో కర్ణాట‌క ఫార్ములా కొన‌సాగుతోంది. సీనియ‌ర్లు క‌లిసి క‌ట్టుగా ప్ర‌య‌త్నం చేయాలి. ముందు పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావాలి. ఆ త‌ర్వాత ప‌ద‌వుల పంపిణీ చూసుకోవాల‌నే దానిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది హై క‌మాండ్. త్వ‌ర‌లో ప‌లు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ప్ర‌స్తుతం డీకే కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా మారారు. ఆయ‌న తెలంగాణ కాంగ్రెస్ లో తెర వెనుక నుండి మంత్రాంగం న‌డిపిస్తున్నారు. ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను చేర్చుకోవడంలో , ఆర్థికంగా సాయం చేయ‌డంలో, పార్టీ హైక‌మాండ్ ఇచ్చిన ప‌వ‌ర్స్ ను ఉప‌యోగించుకుని ఇక్క‌డ పార్టీని అధికారం లోకి తీసుకు వ‌చ్చేలా చేయ‌డంపై ఎక్కువ‌గా దృష్టి పెట్టారు డీకే. అందుకే తెలంగాణ కు చెందిన నేత‌లంతా ఇప్పుడు బెంగ‌ళూరుకు క్యూ క‌డుతున్నారు. టార్చ్ బేర‌ర్ గా పేరు పొందిన శివ‌కుమార్(Shiva Kumar) ను క‌లుస్తున్నారు. ఎప్పుడు ఎవ‌రిని ఎక్క‌డ ఎలా ట‌చ్ చేయాలో, త‌న దారికి వ‌చ్చేలా చేసుకోవ‌డ‌మో లేక తానే వారి దారుల్లో న‌డ‌వ‌డ‌మో చేయ‌డంలో డీకే సిద్ద‌హ‌స్తుడు. ఇక తెలంగాణ‌లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప‌వ‌నాలు మెల మెల్ల‌గా వీస్తున్నాయి. ఈ త‌రుణంలో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన బీఆర్ఎస్ చీఫ్ , సీఎం కేసీఆర్ కు ట్ర‌బుల్ షూట‌ర్ గా పిలుచుకునే డీకే కు మ‌ధ్య పోటీ నెల‌కొన‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. వ్యూహాలు ప‌న్న‌డంలో ఇద్ద‌రికీ ఇద్ద‌రే. మ‌రి తెలంగాణ‌లో ఏ జెండా ఎగుర బోతుంద‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది.

Also Read : KTR Puri : హ‌ర్దీప్ సింగ్ ను క‌లిసిన కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!