Donald Trump Slams :ఐసీసీకి ఘాటుగా బదులిచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

అమెరికా, ఇజ్రాయెల్‌ మాత్రం ఐసీసీలో లేవు...

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెలరేగిపోతున్నారు. తమకు అత్యంత సన్నిహితమైన మిత్రదేశం ఇజ్రాయెల్‌ విషయంలో ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ)కే షాకిచ్చారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌ జారీ చేసినందుకు ఐసీసీపై ఆంక్షలు విధిస్తూ గురువారం కార్యనిర్వాహక ఉత్తర్వులు(ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌) జారీ చేశారు. ఐసీసీ హద్దులు మీరీ తమ ఆంక్షలను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ట్రంప్‌(Donald Trump) తన ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

Donald Trump Slams ICC

ఐసీసీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి బంధువులను అమెరికాలో అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేశారు. నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వైట్‌హౌ్‌సలో మంగళవారం భేటీ అయిన నెతన్యాహు.. క్యాపిటల్‌ హిల్‌లో గురువారం పలువురు చట్టసభ సభ్యులతో సమావేశమయ్యారు. 2023 అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడికి ప్రతిగా.. పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ చేపట్టిన సైనిక చర్య వల్ల వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఇందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, ఆ దేశ మాజీ రక్షణ మంత్రి యొవ్‌ గెలంత్‌పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్లు జారీ చేసింది. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న ఐసీసీలో 125 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ మాత్రం ఐసీసీలో లేవు. దీంతో ఐసీసీ తన పరిధి దాటి అమెరికా, దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై నిరాధర ఆరోపణలతో చర్యలకు ఉపక్రమించిందని ట్రంప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, అమెరికా తమపై ఆంక్షలు విధించడాన్ని ఐసీసీ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఆంక్షలు ఎన్ని ఎదురైనా ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల రక్షణకు ఐసీసీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. మానవహక్కుల పరిరక్షణ కోసం సభ్య దేశాలన్నీ ఐసీసీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చింది.

Also Read : AP Govt-Railway Zone : ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్ర సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!