Janasena Symbol:గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు ఈసీ నివేదిక !
గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు ఈసీ నివేదిక !
Janasena Symbol:గాజు గ్లాసు గుర్తు కేటాయింపు అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు (దాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలోనూ), అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు… విచారణను ముగించింది.
Janasena Symbol:
టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన(Janasena) 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టింది. జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. దీనితో ఎన్డీయే కూటమి అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది.
దీనితో జనసేన పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ పిటిషన్‌లో కోరారు. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా… ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించటం వల్ల కూటమికి నష్టం వస్తుందన్నారు. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేసింది.
Also Read:-YS Sharmila : వైఎస్ వివేకా హత్య జరిగి 5 ఏళ్ళు గడిచిన న్యాయం జరగలేదు