ED Raids: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు !
ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు !
ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. దీనితో మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.
ఛత్తీస్ గఢ్ లో మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసారు. దీనిలో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.
తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది.