Election Commission: జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
Election Commission : భోగస్ మరియు డబుల్ ఓట్లను నియంత్రించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. తద్వారా అత్యంత కచ్చితత్వంతో ఓటరు జాబితాను నవీకరించే వీలుంటుందని పేర్కొంది.
Election Commission Approved
‘‘నమోదిత మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సకాలంలో పొందే వీలుంటుంది. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంతవరకు వేచి చూడకుండా… ఆర్‌జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారు’’ అని ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది. ఎన్నికల నిబంధనలు-1960, జనన, మరణాల నమోదు చట్టం-1969 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఉంది.
బీఎల్‌ఓలకు ఐడీ కార్డులు
ఓటరు సమాచార చీటీ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్ ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నంబర్, పార్టు నంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలికగా గుర్తించడంతోపాటు అటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుంది. దీనితోపాటు బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.
Also Read : Tahawwur Rana: ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ వాయిస్, చేతిరాత శాంపిల్స్ సేకరణకు కోర్టు అనుమతి