Election Commission: సంతకం చేస్తారా ? క్షమాపణ చెప్తారా ? – రాహుల్ కు మరోసారి కోరిన ఈసీ
సంతకం చేస్తారా ? క్షమాపణ చెప్తారా ? - రాహుల్ కు మరోసారి కోరిన ఈసీ
Election Commission : ఓట్ల చోరీపై ఓవైపు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ… ఎన్నికల సంఘం(ఈసీ) మరోసారి డిక్లరేషన్ సమర్పించాలని రాహుల్ గాంధీని కోరింది. ‘‘నిబంధనల ప్రకారం తన వ్యాఖ్యలు వాస్తవమని పేర్కొంటూ రాహుల్ సంతకం చేసి డిక్లరేషన్ సమర్పించాలి. లేదా తాను చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణైనా చెప్పాలి’’ అని ఎన్నికల సంఘంలోని (Election Commission) ఓ అధికారి పేర్కొన్నారు.
గతేడాది జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాకు చెందిన ప్రధాన ఎన్నికల కమిషనర్లు… ఓటర్ల జాబితాల నుంచి తీసివేసిన లేదా మోసపూరితంగా చేర్చిన పేర్ల వివరాలతో పాటు సంతకం చేసిన ఓ డిక్లరేషన్ ను సమర్పించాలని కాంగ్రెస్ నేతను కోరాయి. పార్లమెంటు సభ్యుడిగా రాజ్యాంగాన్ని కాపాడతానని తానిప్పటికే ప్రమాణం చేశాను కాబట్టి ఎలాంటి డిక్లరేషన్ సమర్పించనని రాహుల్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈసీ.. రాహుల్‌ను డిక్లరేషన్ కోరడం గమనార్హం.
Election Commission – నమ్మకం లేకుంటే రాజీనామా చేయండి – బీజేపీ
ఎన్నికల సంఘం(ఈసీ)పై నమ్మకం లేకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని బీజేపీ డిమాండ్ చేసింది. ఓట్ల చౌర్యంపై ఆయన చేసిన ఆరోపణలను ఈసీకి లిఖిత పూర్వకంగా ఇవ్వకపోవడంపై తీవ్రంగా దుయ్యబట్టింది.
ఓట్ల దొంగతనంపై ఈసీ దర్యాప్తు చేపట్టాలి – పవార్
ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఈసీ దర్యాప్తు చేపట్టాలని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సరైన ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.
Also Read : IAF Chief: ‘ఆపరేషన్ సిందూర్’లో ఆరు పాక్ విమానాలు కూల్చాం – IAF చీఫ్
