Enforcement Directorate: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు ! రంగంలోకి ఈడీ !
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు ! రంగంలోకి ఈడీ !
ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పీఎమ్‌ఎల్‌ఏ సెక్షన్ కింద కేసు నమోదుకు తమకు డాక్యుమెంట్లు కావాలని సిట్ అధిపతి, విజయవాడ సీపీకి ఈడీ లేఖ రాసింది. అలాగే కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, ఇప్పటి వరకు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లు వివరాలు పంపాలని ఈడీ కోరింది.
మద్యం కేసుకు సంబందించిన వివరాలను తమకు అందజేయాలని సిట్ చీఫ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు ఈడీ లేఖ రాసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో పేర్కొంది. మద్యం కుంభకోణంపై సీఐడి అధికారులు నమోదు చేసిన 21/2024 ఎఫ్ఐఆర్‌కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. సీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని లేఖలో తెలిపింది. ఈ కేసుతో సంబంధం ఉందని ఇప్పటివరకు దర్యాప్తు అధికారులు గుర్తించిన వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు తమకు అందజేయాలని కోరింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులపై అభియోగపత్రం నమోదు చేస్తే వాటి కాపీలను సైతం ఇవ్వాలని లేఖలో కోరింది.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగినట్లు… కూటమి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం ను వెలికి తీసుకునేందుకు… సిట్ ను రంగంలోనికి దించింది. దీనితో విచారణ చేపట్టిన సిట్… ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ చేసింది. వారిని కస్టడీలోకి తీసుకుని లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు కూడా. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ లను కూడా నిందితులుగా చేర్చి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుంది.
ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీంలో ఎదురు దెబ్బ
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే నిందితులు సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఆ పిటిషన్ ఇప్పుడు విచారణార్హం కాదని పేర్కొన్నారు. హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ నిరాకరించినందున నిందితులు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను సవరించాలని… లేదా కొత్త పిటిషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈక్రమంలో కొత్తగా మరోసారి పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతివ్వాలని ధర్మాసనాన్ని నిందితులు కోరగా… జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం అనుమతించింది.
మరోవైపు ఈ నెల 13వ తేదీ వరకైనా మధ్యంతర రక్షణ కల్పించాలని నిందితుల తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. మధ్యంతర రక్షణ ఇవ్వడం కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. మరోవైపు విజయవాడలోని వెటర్నరీ కాలనీలో సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్ కు అప్పటి కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్ నివాసాల్లో తనిఖీలు చేశారు.