EPFO : 6.5 కోట్ల మంది ‘ఈపీఎఫ్‌వో’ చందాదారులకు శుభవార్త చెప్పిన సర్కార్
1952-53లో ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు 3శాతంగా ఉండేది...
EPFO : దాదాపు 6.5 కోట్ల మంది చందాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) శుభవార్త చెప్పనుంది. ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి చెల్లించే వడ్డీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తమ చందాదారులకు ప్రతి ఏడాది ఒకే వడ్డీని అందించేలా ప్రణాళికను అమలు చేస్తోంది. అంటే ప్రభుత్వం ఈపీఎఫ్‌వో పెట్టుబడుల ద్వారా పొందే ఆదాయం నుంచి దానిని వేరుగా ఉంచాలనుకుంటోంది. దీని కోసం ప్రభుత్వం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ అనే కొత్త నిధిని సృష్టించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి సంవత్సరం వడ్డీ రేటు నుంచి ఆదా అయ్యే అదనపు డబ్బు ఈ నిధిలో జమచేస్తారు. ఉదాహరణకు.. ఒక నిర్దిష్ట సంవత్సరంలో మార్కెట్ పడిపోయి ఈపీఎఫ్ తక్కువ లాభం పొందింది అని అనుకుందాం. అప్పుడు ఈపీఎఫ్‌వో సభ్యుల వడ్డీని ఈ ఫండ్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ద్వారా చెల్లిస్తారు. దీనితో వారికి ఎల్లప్పుడూ స్థిరమైన వడ్డీ లభిస్తుంది.
EPFO Good News
1952-53లో ఈపీఎఫ్‌వో(EPFO)వడ్డీ రేటు 3శాతంగా ఉండేది. క్రమంగా అది 1989-90లో 12 శాతానికి పెరిగింది. ఇదే ఇప్పటివరకు ఉన్న వాటిల్లో అత్యధిక వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటు 2000-01 సంవత్సరం వరకు అలాగే ఉంది. ఆ తర్వాత 2001-02లో 9.5 శాతానికి తగ్గింది. 2005-06 సంవత్సరంలో ఇది మరింతగా 8.5 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత 2010-11లో వడ్డీ రేటును 9.50 శాతానికి పెంచారు. కానీ 2011-12లో మళ్ళీ 8.25 శాతానికి తగ్గించారు. ఇది 2021-22లో 8.10 పర్సంట్ వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త నిధి ద్వారా వడ్డీ రేట్లలో అటువంటి హెచ్చుతగ్గులను నివారించాలనుకుంటోంది.
ప్రస్తుతంఈ ప్రణాళికపై చర్చలు నడుస్తున్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. దీని కోసం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ నిధి ఎలా పని చేస్తుంది, దాంట్లో ఎంత డబ్బును జమ చేస్తారు.. మొదలైన విషయాలన్నీ ఇందులో పొందుపరుస్తారని అధికారులు తెలిపారు. అయితే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటేనే లాభనష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈపీఎఫ్‌వో చందాదారులను ఈ రిస్క్ నుంచి కాపాడి ఎప్పుడూ ఒకే విధమూన వడ్డీ రేటును పొందేలా చూడనుంది.
Also Read : వాయిదా పడ్డ ఢిల్లీ బీజేపీ ఎల్పీ సమావేశం.. సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ