Ex MP Vijayasai Reddy: మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డే – మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డే - మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

Ex MP Vijayasai Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్‌ కార్యాలయంలో సుమారు 3 గంటల పాటు సిట్‌ అధికారుల బృందం ఆయన్ని విచారించింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి(Ex MP Vijayasai Reddy) నుండి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు. సిట్ అధికారుల విచారణకు సహకరించిన విజయసాయి రెడ్డి… అవసరమైతే మళ్ళీ హాజరుకావడానికి కూడా సిట్ ఎదుట సముఖత వ్యక్తం చేసారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి… సిట్ అధికారుల తనను అడిగిన ప్రశ్నలు, వాటికి తాను చెప్పిన సమాధానాలను మీడియాకు వివరిస్తూనే… మద్యం కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

Ex MP Vijayasai Reddy Key Comments

మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే (రాజ్‌ కసిరెడ్డి) అని ఆయన స్పష్టం చేసారు. గతంలో ఇదే విషయాన్ని అధికారులకు చెప్పానని… ఎప్పుడు అడిగినా తాను ఇదే విషయాన్ని చెప్తానన్నారు. ఇక వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత… మద్యం పాలసీకు సంబంధించి హైదరాబాద్‌, విజయవాడలో వేరువేరుగా నిర్వహించిన రెండు సమావేశాల్లో తాను పాల్గొన్నానని చెప్పాడు. కాని ఆ తరువాత మద్యం పాలసీపై ప్రభుత్వం లేదా రాజ్ కసిరెడ్డి తదితరులు తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు. తన అల్లుడు శరత్ చంద్రా రెడ్డికి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ నుండి రాజ్ కసిరెడ్డికి(Raj Kasireddy) వంద కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించానని తెలిపారు. ఆ అప్పుకు సంబంధించి అసలు తీర్చడంతో పాటు… 60 కోట్ల రూపాయలకు సంబంధించి వడ్డీ కూడా చెల్లించారన్నారు. అయితే మిగిలిన 40 కోట్ల రూపాయలకు అయిన వడ్డీ మాత్రం వివిధ కారణాలతో ఇంకా చెల్లించలేదన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం రాజ్ కసిరెడ్డి నడిపారని ఆయన స్పష్టం చేసారు. అంతేకాదు రాజ్ కసిరెడ్డి… ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసారన్నారు.

నెంబర్ 2 నుండి 2000 స్థానానికి నన్ను దిగజార్చారు – విజయసాయి

వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో అన్నీ తానై వ్యవహరించానని… జగన్(YS Jagan) చెప్పిన ప్రతీ పనిని చిత్త శుద్దితో పూర్తి చేసానన్నారు. అయితే పార్టీ అధికారంలోనికి వచ్చిన ఆరు నెలలకే… అతని చుట్టూ కోటరీ చేరి… తనపై దుష్ఫ్రచారం చేసి జగన్ ను దూరం చేసారని ఆరోపించారు. మీడియా, పార్టీ పెద్దలు చెప్పినట్లు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న తాను… 2000 వేల స్థానానికి పడిపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొని… అవి తాళలేక పార్టీను విడిచి బయటకు వచ్చానన్నారు. అయినప్పటికీ సాక్షి మీడియా స్థాపనలో కీలక పాత్ర పోషించిన తనపై… అదే ఛానెల్ లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయించడం తనకు బాధ కలిగించాయన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకుంటానని గతంలో చెప్పడం జరిగిందని… దానిని కూడా వ్యంగ్యంగా సాక్షి మీడియాలో వ్యాఖ్యానించడం తన మనసును గాయపరిచాయన్నారు. కాబట్టి ప్రజలు కోరుకుంటే మరల రాజకీయాల్లోకి వస్తానని… దానికి మీడియా లేదా మరొకరి పర్మిషన్ తనకు అవసరం లేదని కుండబద్దలు గొట్టారు.

Also Read : Pawan Kalyan: గిరిపుత్రులకు పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ! ఆనందంలో అల్లూరి జిల్లా గిరిజనులు !

Leave A Reply

Your Email Id will not be published!