Fox Conn : హైదరాబాద్ లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘ఫాక్స్ కాన్’ చైర్మన్ లియూ
ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు...
Fox Conn : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్ కాన్(Fox Conn) ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు.. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు.
Fox Conn Chairman Meet..
నవ తరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్రను ఛైర్మన్‌గా, మరో పారిశ్రామిక వేత్త శ్రీనివాస రాజును వైస్ ఛైర్మన్‌గా నియమించామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)తో పాటు హైదరాబాద్‌కు ఉన్న అన్ని అనుకూలతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వారికి వివరించారు.
ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్(Fox Conn) సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్దతు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూకి హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్ యాంగ్ లియూకి వివరించారు.
ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్(Fox Conn) ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజన్ అద్భుతంగా ఉందంటూ రేవంత్‌ను యాంగ్ లియూ అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్ ను సందర్శిస్తానని తెలిపారు.
అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని ఆయన చెప్పారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి (ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎక్సటర్నల్ ఎంగేజ్‌మెంట్), ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ డాక్టర్ ఎస్కే శర్మ, ఫాక్స్ కాన్ నుంచి సంస్థ ఎస్బీజీ ప్రెసిడెంట్ బాబ్ చెన్, సీబీజీ జీఎం జొ వూ, చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సీఎస్‌బీజీ డిప్యూటీ జీఎం సూ, షొ కూ, సీ-గ్రూప్ మేనేజర్ సైమన్ సంగ్ , సంస్థ భారత దేశ ప్రతినిధి వీ లీ తదితరులు పాల్గొన్నారు.
Also Read : MP Ramasahayam : ‘సీతారామ’ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వి తప్పుడు వ్యాఖ్యలు