Gaddar Awards: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం
Gaddar Awards : సుమారు 14 ఏళ్ళ తరువాత గద్దర్ పేరుతో ప్రభుత్వం ఇవ్వబోయే తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జూన్ 14న నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ‘‘తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్(Gaddar). చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ గద్దర్ బాణి, పాటలను అనుకరిస్తారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయం. హైదరాబాద్‌లో జరిగే చలన చిత్ర అవార్డులు ఘనంగా నిర్వహించాలి. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తాం’’ అని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్రాలను మాత్రమే కాదు.. ఉర్దూ చిత్రాలనూ ప్రోత్సహిస్తామని తెలిపారు. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, జూరీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Gaddar Awards in Telangana
జూన్ 14న హెచ్‌ఐసీసీ వేదిగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల(Gaddar Awards) ప్రదానోత్సవం నిర్వహిస్తున్నామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ కమిటీకి ఛైర్మన్ గా నటి జయసుధ ను ఎంపిక చేశారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందినట్టు ఇటీవల వెల్లడించారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరగనున్న అవార్డుల వేడుకని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దురదృష్టవశాత్తూ దశాబ్దకాలంలో ఎలాంటి అవార్డులు పోత్సాహకాలు సినీ పరిశ్రమ చూడలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహించిందని, ఎక్కడో ఉన్న సిని పరిశ్రమను ఇక్కడకు తీసుకురావటం… ఫిలింనగర్ ఏర్లాటు.. కార్మికులకు హౌసింగ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం తనవంతు కృషి చెస్తున్నానని, సినిమా పరిశ్రమను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ రెడ్డి గద్దర్ చలనచిత్ర అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారని భట్టి విక్రమార్క అన్నారు.
గద్దర్ తెలంగాణా(Telangana) సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామన్నారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలని… అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పామన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ట్రాన్స్ పరెంట్‌గా ఉత్తమ సినిమాలను ఎంపిక చేయాలని జ్యూరీ సభ్యులను కోరుతున్నామన్నారు. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆయన పేరుపైనే అవార్డులు ఇస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు
గద్దర్ తెలంగాణా ఫిలిం అవార్డ్స్ జ్యూరీకు చైర్ పర్సన్‌గా తనను ఎంపిక చేసినందుకు జయసుధ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు. మా జ్యూరీ మెంబర్స్ అందరూ కలిసి ఉత్తమ సినిమాలను ఎంపిక చేస్తామని జయసుధ అన్నారు.
Also Read : Inter Results: తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల